Women Reservation Bill
* 2029 ఎన్నికలే లక్ష్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు..
* కేంద్రం కొత్త వ్యూహం.. గతంలో వీగిన బిల్లు..
* ఈసారి ఆమోదం పొందేనా?
ఆకేరు న్యూస్, డెస్క్ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ (Women Reservation Bill )కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గత ఏప్రిల్లో లోక్సభలో అవసరమైన మద్దతు లభించక వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లును (Women Reservation Bill ) కొన్ని కీలక సవరణలతో మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కొత్త రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
గతంలో ఎందుకు వీగిపోయింది?
మహిళలకు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. మొత్తం 361 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా, అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందలేదు. ప్రతిపక్షాల నుంచి 230 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.
ఈసారి కీలక సవరణలు..
గతంలో బిల్లుపై వ్యక్తమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి కొన్ని మార్పులు ప్రతిపాదించింది. లోక్సభ స్థానాలను గరిష్ఠంగా 850కి, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 650కి పెంచే ప్రతిపాదన ఇందులో ఉంది. అలాగే ప్రస్తుతమున్న ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం మేర పెంచేలా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిని 2051 తర్వాత నిర్వహించే జనగణన వివరాలు అందుబాటులోకి వచ్చే వరకు కొనసాగించే ప్రతిపాదన కూడా ఉంది. నియోజకవర్గాల సరిహద్దుల నిర్ణయానికి 2011 జనగణనను ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రతిపాదించారు.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు పరిష్కారమా?
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన ద్వారా రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. డీఎంకే, సమాజ్వాదీ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీల అభ్యంతరాలను తొలగించి మద్దతు కూడగట్టేందుకు కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
రాజకీయ సమీకరణాలపై బీజేపీ ఆశలు..
గతంలో బిల్లుకు అవసరమైన మద్దతు లభించకపోవడంతో ఈసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు ముమ్మరం చేసింది. టీఎంసీ ఎంపీల్లో చీలిక, శివసేనలో మారిన రాజకీయ పరిణామాలు తమకు అనుకూలంగా మారవచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే డీఎంకే, సమాజ్వాదీ పార్టీ సహా పలు ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకం కానుంది. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడమే కేంద్రానికి ప్రధాన సవాలుగా మారింది.
2029 ఎన్నికల్లో అమలు చేసే లక్ష్యం..
మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తే లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం లభిస్తుంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ రిజర్వేషన్లను 2029 లోక్సభ ఎన్నికల నాటికి అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లుల భవితవ్యం తేలనుంది.
Also Read : చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Please tell us what is wrong. Your report will be sent to the website team.

