కోట శ్రీరామ్ (ఫైల్)
* తల్లికి, యజమానికి వీడియో సందేశం..
* రూ.99,999 బదిలీ ఆరోపణలు..
ఆకేరు న్యూస్, డెస్క్: మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ పరిధిలో ఓ యువకుడి అనుమానాస్పద (Suspicious Death ) మృతి కలకలం రేపింది. చౌదరిగూడలోని లివింగ్ ట్రీ ఓయూ హోటల్ గదిలో గుంటూరుకు చెందిన కోట శ్రీరామ్ (29) మృతి చెంది కనిపించాడు. ఈ ఘటనపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు, ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. గుంటూరులోని ఓ ప్రైవేట్ థియేటర్లో కోట శ్రీరామ్ కస్టమర్ కేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే థియేటర్‌కు చెందిన నగదు, మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంతో పాటు ఫోన్‌పే ద్వారా రూ.99,999 తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు థియేటర్ యజమాని ఆరోపించినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై యజమాని ఫిర్యాదు చేయడంతో శ్రీరామ్ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 27న తన పరిస్థితిని వివరిస్తూ తల్లికి, థియేటర్ యజమానికి వీడియో సందేశం పంపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాను ఉన్న హోటల్ లొకేషన్‌ను కూడా షేర్ చేశాడు.
అయితే హోటల్ సిబ్బంది గదిలో పరిశీలించగా శ్రీరామ్ మృతి చెంది (Suspicious Death ) కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడి మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్థిక వివాదం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందా? మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

