Credit Card Fraud
* ICICI కస్టమర్‌కు రూ.1.29 లక్షల టోకరా..!
ఆకేరు న్యూస్, డెస్క్ : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారు. బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి, కస్టమర్లను నమ్మించి వారి ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. తాజాగా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు (Credit Card Fraud) వినియోగదారుడిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. నెలకు రూ.2,999 సెక్యూరిటీ ఛార్జీ పడుతోందని నమ్మించిన దుండగులు.. చివరకు బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా రూ.1.29 లక్షలు కాజేశారు.
* రూ.2,999 సెక్యూరిటీ ఛార్జీ పేరుతో నాటకం..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన 47 ఏళ్ల రైల్వే ఉద్యోగికి నవంబర్ 24న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు విభాగం (Credit Card Fraud) నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. బాధితుడి క్రెడిట్ కార్డుపై నెలకు రూ.2,999 సెక్యూరిటీ ఛార్జీ యాక్టివేట్ అయిందని, దాన్ని నిలిపివేయవచ్చని చెప్పాడు. ఆ ఛార్జీని తొలగించాలని బాధితుడు కోరడంతో.. ఈ ప్రక్రియ కోసం మరో మహిళ ఫోన్ చేస్తుందని చెప్పి కాల్ కట్ చేశాడు.
* iMobile యాప్‌లో ఆ సెట్టింగ్ మార్చడంతో..
కొద్దిసేపటికే మరో నంబర్ నుంచి మహిళ ఫోన్ చేసింది. సెక్యూరిటీ ఛార్జీని నిలిపివేసే ప్రక్రియలో భాగంగా ICICI బ్యాంక్ iMobile యాప్‌ను ఓపెన్ చేయాలని సూచించింది. ఆమె చెప్పిన విధంగా బాధితుడు యాప్‌లోకి వెళ్లాడు. అక్కడ యాక్టివ్‌గా ఉన్న ‘Security Alert’ ఫీచర్‌ను డిసేబుల్ చేయాలని సూచించడంతో అలాగే చేశాడు. ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తులు కాల్ కట్ చేశారు.
కొద్ది నిమిషాల్లోనే బాధితుడి క్రెడిట్ కార్డు ద్వారా రూ.1.29 లక్షల ఆన్లైన్ లావాదేవీ జరిగినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసి క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాడు. అనంతరం బ్యాంకులోనూ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ తప్పులు చేయొద్దు!
ఈ ఘటన నేపథ్యంలో బ్యాంకు కస్టమర్లు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
- బ్యాంకు అధికారులమని చెప్పి ఫోన్ చేసినా.. వారి సూచనలతో యాప్‌లో సెక్యూరిటీ ఫీచర్లను డిసేబుల్ చేయొద్దు.
- OTP, CVV, PIN, పాస్వర్డ్ వంటి వివరాలను ఎవరికీ చెప్పొద్దు.
- గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయొద్దు.
- ఫోన్లో చెప్పినట్లు అనుమానాస్పద యాప్‌లు ఇన్స్టాల్ చేయొద్దు.
- బ్యాంకు నుంచి వచ్చినట్లు చెప్పే కాల్ నిజమైనదో కాదో అధికారిక కస్టమర్ కేర్ ద్వారా నిర్ధారించుకోండి.
* మోసానికి గురైతే వెంటనే ఏం చేయాలి?
క్రెడిట్ కార్డు నుంచి అనధికార లావాదేవీ జరిగినట్లు గుర్తిస్తే ఆలస్యం చేయకుండా బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. కార్డును బ్లాక్ చేయించి, లావాదేవీపై వివాద ఫిర్యాదు నమోదు చేయాలి. వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి.
ICICI బ్యాంకు అధికారిక సూచనల ప్రకారం, మోసానికి గురైనవారు 1800 2662 నంబర్‌కు కూడా సమాచారం ఇవ్వవచ్చు. బ్యాంకు ఉద్యోగులు OTP, CVV, PIN లేదా పాస్వర్డ్ వంటి రహస్య వివరాలను ఫోన్ లేదా మెసేజ్ ద్వారా అడగరని బ్యాంకు స్పష్టం చేస్తోంది.
గుర్తుంచుకోండి.. మీ బ్యాంకింగ్ యాప్‌లోని సెక్యూరిటీ సెట్టింగులను ఇతరుల సూచనల మేరకు మార్చకండి. చిన్న నిర్లక్ష్యం కూడా భారీ ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు.
Also Read : ఆర్టీసీలో 146 అద్దె బస్సుల గడువు ముగింపు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

