మంత్రి దామోదర రాజనర్సింహ
* త్వరలో ఆస్పత్రి ప్రారంభం.. ప్రజలకు వైద్య సేవలు
* మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ప్రకటన
ఆకేరు న్యూస్, వరంగల్ : జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ (Warangal Super Specialty Hospital) ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవల్లో 90 శాతం స్థానికంగానే అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
* వైద్య సేవలు, డాక్టర్ల హాజరుపై సమీక్ష..
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు, వైద్యుల హాజరు తీరుపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో వైద్యులు సమయానికి విధులకు హాజరవుతున్నారా? రోగులకు సరైన వైద్యం అందుతోందా? అనే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
డాక్టర్ల అటెండెన్స్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. వైద్య సేవల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగితే జిల్లా స్థాయి అధికారులపైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
* బస్తీ దవాఖాన్లకు నేరుగా మందులు..
జిల్లాల్లోని బస్తీ దవాఖాన్లకు సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ నుంచే నేరుగా మందులు పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. దీనివల్ల మందుల సరఫరాలో జాప్యం తగ్గడంతో పాటు, ప్రజలకు అవసరమైన ఔషధాలు సకాలంలో అందేలా చూడాలని అధికారులకు తెలిపారు.
* సబ్ సెంటర్ల అప్‌గ్రేడ్‌కు ఆదేశాలు..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. జిల్లాల్లోని అన్ని సబ్ సెంటర్లను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
* త్వరలో అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ సేవలు..
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి (Super Specialty Hospital) ప్రారంభమైతే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్య సమస్యల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడం ప్రభుత్వ లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల హాజరు, మందుల సరఫరా, మౌలిక సదుపాయాల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు.
Also Read : ఆర్టీసీలో 146 అద్దె బస్సుల గడువు ముగింపు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

