* సీఐటీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఉప్పలయ్య
* కనీస వేతనాలు 26వేలు ఇవ్వాలి
* కార్మిక చట్టాలు అమలు చేయాలి
* సీఐటీయూ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ధర్నా
ఆకేరు న్యూస్, హనుమకొండ : కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, నాన్ పర్మినెంట్ కార్మికులకు పని భద్రత కల్పించాలని, కనీస వేతనాలు 26 వేలకు పెంచాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు హనుమకొండ జిల్లా అధ్యక్షులు టి ఉప్పలయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపల్ కార్మికులకు, ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న నాన్ పర్మినెంట్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు పని భద్రత కల్పించి, 26వేల కనీస వేతనం అమలు చేయాలని, ఈ విషయంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ.. కార్మికుల జీవితాలతో ఆటలాడుతూ కార్పొరేట్ శక్తులకు, యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని ఉప్పలయ్య తీవ్రంగా విమర్శించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి, యాజమాన్యాలకు ఊడిగం చేసే విధంగా, బానిసల్లాగా మారుస్తూ 4 లేబర్ కోడ్లను తెచ్చి, ఇక కార్మికులు 12 గంటలు పని చేసే విధంగా, లేబర్ కోడ్లు అమలుకు రూల్స్ రూపొందిస్తున్నారని ఉప్పలయ్య విమర్శించారు.
గత పది సంవత్సరాలపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన కార్మిక వ్యతిరేక విధానాల వల్లనే కార్మికులు ఓటు అనే ఆయుధం ద్వారా కేంద్ర బిజెపికి తగిన బుద్ధి చెప్పి, 63 ఎంపీ సీట్లల్లో ఓడిరచినప్పటికీ వారికి బుద్ధి రాలేదని, రాష్ట్రంలో బిఆర్టియు టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఆ పార్టీకి కోలుకోలేని విధంగా ప్రజలు కార్మికులు బుద్ధి చెప్పారని హెద్దేవ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు లాగా కాకుండా ప్రజలకు కార్మికులకు మంచి చేస్తదని కార్మికులు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని.. ఈ విషయాన్ని మరచిపోవద్దని గుర్తుచేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి, కార్మికులు, ప్రజల ఆదరణ పొందాలన్నారు. లేదంటే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికికూడా పడుతుందని ఉప్పలయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బరుపట్ల మహేష్, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు యాస బాబు సీఐటీయూ నాయకులు మాతంగి నవనీత, కాజీపేట మండల అధ్యక్ష కార్యదర్శులు రెంటాల కోటి, ఎర్ర నరేష్, హసన్పర్తి మండల అధ్యక్షులు కార్యదర్శి రేణిగుంట్ల సురేష్, నాగరాజు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు,మారపాక అనిల్,ఇమ్మడి సాగర్, జవాన్లు సుధాకర్ రెడ్డి, సతీష్, మౌనిక,శ్రీనివాసు, కరుణ,మంద సువర్ణ,మంద చిన్ని,రోహిత్, కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కార్మికుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్కు అందజేశారు.
………………………………………….