* ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర వివరాలు కార్డు వెనుక భాగంలో
రూపకల్పన జరగాలని అధికారులకు ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కుటుంబంలోని సభ్యుల పేర్లు, ఇతర వివరాలను కార్డు వెనుక భాగంలో ఉండే విధంగా కార్డుల రూపకల్పన జరగాలని చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. సీఎం గారి ఆదేశాల మేరకు అధికారులు ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రల్లో డిజిటల్ కార్డుల అమలుపై చేసిన అధ్యయన వివరాలను సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం గారు రాష్ట్రంలో జారీ చేసే డిజిటల్ కార్డుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ప్రస్తుత రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డాటా ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలన్నారు.
బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వివరాలు అవసరం లేదని.. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాలని పేర్కొన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో ఏఏ అంశాలను పొందుపరచాలన్న వివరాలను నివేదిక రూపంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గార్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘానికి అందించాలని కోరారు. మంత్రివర్గ ఉప సంఘం సూచనలకు అనుగుణంగా సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించాలని.. అక్టోబర్ 3వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎలాంటి లోపాలు లేకుండా క్షేత్రస్థాయి (డోర్ టు డోర్) పరిశీలన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
