ఆకేరు న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ నెలంతా విమానాలు బాంబుల భయం(Bomb Threat)తో బెదిరిపోతున్నాయి. ప్రయాణికులు, అధికారులు బెదిరింపులతో ఉలిక్కిపడుతున్నారు. 15 రోజుల్లోనే ఏకంగా 500కుపైగా విమనాలకు బాంబు బెదిరింపు కాల్స్/ఈమెయిల్స్/ఎక్స్ మెసేజ్‌లు వచ్చాయి. ఎయిరిండియా(Airindia) ఇండిగో(Indigo), విస్తారా(Vistara) సంస్థల విమానాలకు ఎక్స్‌లో బెదిరింపులు రాగా.. గుర్తుతెలియని వ్యక్తులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు విమానాలకు బాంబు బెదిరింపులు చేస్తున్న వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని గోండియాకు చెందిన జగదీశ్ ఊకే(35) బెదిరింపు మెయిల్స్ చేస్తున్నట్లు డీసీపీ శ్వేత ఖేద్కర్ వెల్లడించారు. ఇతను ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విమానయాన కార్యాలయాలు, డీజీపీ, రైల్వే రక్షక దళం సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకూ బెదిరింపు మెయిల్స్ పంపినట్లు తెలిపారు. అతడు టెర్రరిజంపై పుస్తకం రాయడమే కాక, 2021లో ఒక కేసులో అరెస్టయ్యాడని వెల్లడించారు. కాగా, తాజాగా మరో మూడు విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Samshabad Airport)లో హైదరాబాద్(Hyderabad) నుంచి చెన్నై(Chennai) వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, ఎయిర్ ఇండియాకు చెందిన చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం ఉన్నాయి. వాటిలో బాంబు పెట్టినట్లు ఆగంతుకులు పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు, సీఐఎస్ఎఫ్ వర్గాలు.. మూడు విమానాలను తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
……………………………………………………………….