Manuguru Shiva Murder Case
* రాఖీ పండుగకు ఇంటికొచ్చిన యువకుడి హత్య
అకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:
మణుగూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాఖీ పండుగ సందర్భంగా సొంతూరికి వచ్చిన ఓ యువకుడిని సుమారు 30 మంది యువకులు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. మణుగూరుకు చెందిన శివ (28) హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. రాఖీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసేందుకు సొంత గ్రామానికి వచ్చాడు.
శివ వద్ద పనిచేస్తున్న సతీష్ అనే కార్మికుడి సోదరిని కొందరు స్థానిక యువకులు వేధిస్తున్నారని తెలిసి, గతంలో వారిని శివ హెచ్చరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న గ్యాంగ్ సభ్యులు శివపై పగ పెంచుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
మాట్లాడుదామని చెప్పి శివను ఏరియా స్టోర్ గ్రౌండ్స్‌కు పిలిపించినట్లు సమాచారం. అక్కడికి చేరుకున్న శివపై పథకం ప్రకారం పలువురు యువకులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. విచక్షణారహితంగా పిడిగుద్దులతో దాడి చేయడంతో శివ తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు.
దాడిలో శివ ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలు కావడంతో పాటు పక్కటెముకలు విరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్ర గాయాల కారణంగా శివ మృతి చెందాడు. శివను రక్షించేందుకు ప్రయత్నించిన ఉదయ్ కుమార్ అనే యువకుడికి కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏడుగురిపై BNS సెక్షన్ 182(2), 103(2), 115(2), 190తో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
* కన్నీళ్లతో చివరి రాఖీ కట్టిన సోదరి
రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన తన సోదరుడు అదే పండుగ రోజున మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతి చెందిన శివకు అతని సోదరి కన్నీళ్లతో చివరి రాఖీ కట్టిన దృశ్యాలు స్థానికులను కలచివేశాయి.
* గ్యాంగ్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
మణుగూరులోని MK గ్రూప్ నిత్యం వివాదాలు సృష్టిస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రూప్‌లో పెద్ద సంఖ్యలో యువకులు ఉన్నారని, గతంలోనూ పలువురు ప్రజలతో గొడవలు, దాడులకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారు.
శివ హత్య ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
