
* సినిమా అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం
* 2014 నుంచి అవార్డులకు నోచుకోని సినిమాలు
* హర్షం వ్యక్తం చేస్తున్న సినీ పరిశ్రమ
* పైడి జయరాజ్.. కాంతారావులకు సముచిత గౌరవం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : సినీ కళాకారులకు ప్రతీ ఏటా అందించే అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సినీ అవార్డుల ప్రకటనపై సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది.. రాష్ట్ర విభజన తరువాత ఉత్తమ చిత్రాలకిచ్చే అవార్డుల ప్రక్రియ ఆగిపోయింది కారణం తెలియదు కాని అటు ఆంధ్రప్రదే్శ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ సినీ అవార్డుల గురించి పట్టించికోలేదు.. అవార్డుల ప్రదానం నిలిచిపోవడంతో సినీ పరిశ్రమ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది..సినీ ప్రముఖులు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి అవార్డుల గురించి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఏ కారణం చేతనో కాని అవార్డుల ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి అవార్డుల ప్రక్రియను పునరద్ధరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నంది అవార్డుల స్థానంలో ప్రజాగాయకుడు గద్దర్ పేరుమీద ఉత్తమ సినిమాలకు ఉత్తమ కళాకారులకు అవార్డులు ఇచ్చే విధంగా సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. పదేండ్లుగా పెండింగ్లో ఉన్న (2014 నుంచి 2023 వరకు) కూడా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు సీనియర్ నటుడి మురళీ మోహన్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. సీనియర్ నటి జయసుధ నేతృత్వంలో ప్రత్యేక జ్యూరీ ఏర్పాటు చేసి 2014 నుంచి 2023 వరకు వచ్చిన చిత్రాల్లోంచి ఉత్తమ చిత్రాలను ఉత్తమ కళాకారులను ఎంపిక చేసింది.మురళీమోహన్ ఛైర్మన్గా వ్యవహరించిన ఈ కమిటీలో దర్శకుడు కె. దశరథ్, నిర్మాత డి.వి.కె. రాజు, నటి ఊహ, సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావు, నర్తకి వనజా ఉదయ్, దర్శకుడు కూచిపూడి వెంకట్, కె. శ్రీధర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎం.డి. హరీష్ సభ్యుడిగా ఉన్నారు..
ఆరు స్పెషల్ అవార్డులు
గద్దర్ అవార్డులతో పాటు మరో ఆరు ప్రత్యేక అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఇచ్చిన ఎన్టీఆర్ జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య, బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి – చక్రపాణి అవార్డులతో పాటు అదనంగా పైడి జయరాజ్, కాంతారావు పేర్లతోనూ అవార్డులను మీడియా సమక్షంలో మురళీ మోహన్ ప్రకటించారు.
కాంతారావు.. పైడి జయరాజ్ లకు దక్కిన గౌరవం
తెలంగాణ ప్రాంతం నుంచి నటుడిగా అంచెలంచెలుగా ఎదిగి అక్కినేని నాగేశ్వర్ రావు.. ఎన్టీ ఆర్ లతో సమానంగా సినీ పరిశ్రమలో రాణించిన కాంతారావు పేరు మీద కూడా అవార్డును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.. అలాగే దశాబ్దాల క్రితమే కరీంనగర్ ప్రాంతం నుంచి బొంబాయి వెళ్లి హిందీ సినిమాల్లో తన ప్రత్యేకతను చాటుకున్న పైడి జయరాజ్ పేరు మీద కూడా ప్రత్యేక నేషనల్ అవార్డు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పైడి జయరాజ్ ను కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో 1980లో సన్మానించింది . ఎట్టకేలకు తెలుగు చిత్ర పరిశ్రమ పైడి జయరాజ్ ను గుర్తించినందుకు తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
……………………………………………….