
* ఇన్చార్జి పదవి కోసం పోరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో కలహాల పోరు కొనసాగుతోంది. రోజుకో ప్రాంతం, వ్యక్తుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మరోవైపు పదవుల కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. తాజాగా సూర్యాపేట ఇన్చార్జి పోస్టు కోసం నేతలు చేస్తున్న పోరు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి (Ramreddy Damoder reddy) మరణం తర్వాత సూర్యాపేట నియోజక వర్గ ఇన్చార్జ్ పదవి కోసం ఆ పార్టీలోఆధిపత్య పోరు మొదలైంది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి(Sarvothamareddy)ని సూర్యాపేట నియోజక వర్గ ఇన్చార్జ్గా ప్రకటించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్లో రెండు రోజుల క్రితం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇటీవల రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆదిశగా చర్యలు చేపట్టాలనేది వారి వాదన. ఇప్పుడు అకస్మాత్తుగా పటేల్ రమేష్ రెడ్డి (Patel Ramesh reddy) అనుచరుల గాంధీభవన్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం రమేష్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అధిష్టానం దామోదర్ రెడ్డి వైపు మొగ్గుచూపింది. కానీ, రాంరెడ్డి దామోదర్ రెడ్డి గెలవలేకపోయారు. దీంతో రెండుసార్లు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లను త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డికి ఇన్చార్జ్ ఇవ్వాలని అనుచరులు గాంధీభవన్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
…………………………………………..