Khavdya Hill Maharashtra Cellphone Dispute Tragedy
* కొడుకు, తండ్రి, తల్లి మృతి
* మూడు గంటల పాటు బతిమాలిన తల్లిదండ్రులు
* ఐఫోన్ 15 ప్రో ఇస్తా.. కిందికి రా’ అన్న సర్పంచ్
* కొడుకును కాపాడబోయి లోయలో పడిపోయిన తండ్రి
* భర్త, కొడుకు కళ్లముందే పడిపోవడంతో తల్లి సైతం
ఆకేరు న్యూస్ డెస్క్: ఒక సెల్‌ఫోన్ చుట్టూ మొదలైన కుటుంబ వివాదం.. చివరకు ఒక కుటుంబాన్నే తుడిచిపెట్టేసింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో శుక్రవారం జరిగిన ఘటనలో 18 ఏళ్ల కుమారుడితోపాటు అతడి తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కొడుకును ఎలాగైనా బతికించుకోవాలని దాదాపు మూడు గంటలపాటు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం చివరకు ముగ్గురి మరణంతో విషాదాంతమైంది.మృతులను కునాల్ మురళీధర్ చాందవడే (18), అతడి తండ్రి మురళీధర్ చాందవడే, తల్లి సంగీత చాందవడేగా గుర్తించారు. వీరు ఛత్రపతి శంభాజీనగర్‌లోని దేవ్లాయి–సాతారా ప్రాంతంలో నివసిస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
* ఖవడ్యా కొండపై మూడు గంటల ఉత్కంఠ
శుక్రవారం ఉదయం కునాల్ తిస్గావ్ సమీపంలోని ఖవడ్యా డోంగర్ (Khavdya Hill) పైకి వెళ్లాడు. కొండ అంచున ప్రమాదకరమైన ప్రదేశంలో నిలబడిన అతడిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చారు. అతడిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి దాదాపు మూడు గంటలపాటు ప్రయత్నాలు జరిగాయి.
అగ్నిమాపక సిబ్బంది కొండ కింద రక్షణ వలను కూడా సిద్ధం చేసినట్లుగా సమాచారం . అయితే కునాల్ ఒకే చోట నిలబడకుండా కొండ అంచున స్థానం మారుస్తుండటంతో అతడిని రక్షించడం కష్టంగా మారింది.
* బాబూ.. ఇంటికి వచ్చేయ్ ..
అక్కడ కనిపించిన అత్యంత హృదయ విదారక దృశ్యం తల్లి సంగీతది.కొండ అంచున ఉన్న కుమారుడితో ఆమె చాలాసేపు మాట్లాడుతూ వెనక్కి రావాలని వేడుకున్నారు. గ్రామస్థులు కూడా జీవితం ముగించుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదని అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తిస్గావ్ స్థానిక ప్రజాప్రతినిధి కూడా కునాల్‌ను మాటల్లో పెట్టి కిందికి తీసుకురావడానికి ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది..
నీకు ఐఫోన్ 15 ప్రో ఇప్పిస్తా.. కిందికి రా’ అంటూ స్థానిక సర్పంచ్ కునాల్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు ఏబీపీ మాఝా కథనం పేర్కొంది. కానీ కునాల్ అప్పటికే తీవ్ర నిరాశలో ఉన్నట్లు కనిపించాడని, తన సమస్యకు ఇక పరిష్కారం లేదనే భావనను వ్యక్తం చేసినట్లు ఆ కథనం తెలిపింది.అయితే ఈ ఘటనకు మూల కారణం కేవలం సెల్‌ఫోన్ కొనివ్వకపోవడమేనని పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించినట్లు స్పష్టమైన సమాచారం లేదు. కొన్ని కథనాలు కుటుంబ వివాదం, మానసిక ఒత్తిడిని కారణాలుగా పేర్కొంటున్నాయి.
* కొడుకును పట్టుకునేందుకు తండ్రి చివరి ప్రయత్నం
దాదాపు మూడు గంటలుగా సాగుతున్న ఉత్కంఠ మధ్య చివరి 15–20 నిమిషాల్లో తండ్రి మురళీధర్ కొండపైకి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనాలు చెబుతున్నాయి. తండ్రి వస్తే కుమారుడి మనసు మారుతుందని అక్కడున్నవారు ఆశించారు.మురళీధర్ నెమ్మదిగా కుమారుడికి దగ్గరయ్యారు. అతడిని పట్టుకుని వెనక్కి లాగేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో కునాల్ కొండ అంచు నుంచి కిందికి పడిపోగా, కుమారుడిని పట్టుకునే ప్రయత్నంలో తండ్రి కూడా అదుపు కోల్పోయి అతడితోపాటే లోయలో పడిపోయినట్లు గా తెలుస్తోంది.
* కళ్లముందే భర్త.. కొడుకు..
అప్పటివరకు కుమారుడిని బతిమాలుతున్న సంగీతకు కళ్లముందే ఊహించలేని దృశ్యం కనిపించింది.
కొడుకు, భర్త ఇద్దరూ కొండ కిందకు పడిపోయారు. వారిద్దరూ పడిపోవడాన్ని చూసిన తీవ్ర ఆవేదనలో సంగీత కూడా కొండపై నుంచి కిందికి దూకినట్లుగా సమాచారం ఎత్తైన కొండ నుంచి రాతి క్వారీ ప్రాంతంలో పడిపోవడంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.అప్పటివరకు కునాల్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు చూస్తుండగానే కొద్ది క్షణాల వ్యవధిలో ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవడం అక్కడున్న వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృత దేహాలను లోయ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఘాటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
* అదే కొండపై ఏడాది క్రితం మరో సెల్‌ఫోన్ విషాదం
2025 ఆగస్టులో ఇదే ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఖవడ్యా కొండపై 16 ఏళ్ల బాలుడు సెల్‌ఫోన్ కొనివ్వలేదనే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న ఘటన నమోదైంది. అతడిని అథర్వ గోపాల్ తాయ్డేగా గుర్తించారు. పోలీసు నియామక పరీక్షకు సిద్ధమవుతున్న అతడు కొత్త మొబైల్ కావాలని కోరగా కుటుంబం నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటి పోలీసు దర్యాప్తును ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి.
ఏడాది తిరగకముందే అదే కొండపై మరో కుటుంబం ఇలా ముగిసిపోవడం ఖవడ్యా కొండ భద్రతపైనా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ధూలే–సోలాపూర్ జాతీయ రహదారి సమీపంలోని ఈ ప్రాంతంలో ఎత్తైన రాతి కడలు, లోతైన క్వారీలు ఉన్నాయని, గతంలోనూ ప్రమాదాలు జరిగినట్లు స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి. అటువైపు వెళ్ళకుండా రక్షణ ఏర్పాట్లు చేస్తే బావుంటుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
——————————————

Please tell us what is wrong. Your report will be sent to the website team.
