* ఎన్నికల హామీని నెరవేర్చాలంటూ డిమాండ్
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తమకు ఉద్యోగాలివ్వాలని ఓ మాజీ హోంగార్డు ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు దిగేది లేదంటూ హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం వద్ద టవర్‌పైకి ఎక్కి భీష్మించుకు కూర్చున్నారు. రోడ్డుమీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డుగా విధులు నిర్వహించిన వీరాంజనేయులు.. టవరెక్కి ఆందోళనకు దిగారు. తాను ఉమ్మడి రాష్ట్రంలో విధులు నిర్వహించానని చెప్పారు. 250 మంది హోంగార్డులను సమైక్య పాలకులు అన్యాయంగా తొలగించారని తెలిపారు. పదేండ్లపాటు విధులు నిర్వహించామని వెల్లడిరచారు. అప్పట్లో అన్ని డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహించామని, తమకు గుర్తింపుగా సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్లు, హెల్త్ కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని తమపై కక్షగట్టిన ప్రభుత్వం విధుల నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికారంలోకి రాగానే తమను విధుల్లోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. ఏడాది గడుస్తున్నా తమను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తమ గురించి అసెంబ్లీలో చర్చించాలని, తొలగించిన 250మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకొని తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
…………………………………………