* ప్రపంచ సుందరీ పోటీలు తెలుగు రాష్ట్రాల్లో మొదటి సారి
* అందరి చూపూ హైదరాబాద్ పైనే
* 120 దేశాల నుంచి అందగత్తెల రాక
* ప్రతిష్టాత్మకంగా సర్కారు ఏర్పాట్లు
* స్వయంగా పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
* ఓవైపు ఆనందోత్సవాలు.. మరోవైపు ఆందోళనలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటక, పారిశ్రామిక పరంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ఈ ఈవెంట్ మలుచుకోవాలని భావిస్తోంది. ఈనేపథ్యంలో స్వయంగా దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న వారికి అసౌకర్యం కలగకుండా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎయిర్ పోర్టులు, అతిథులు బస చేసే హోటళ్లతో పాటు అందాల పోటీలు జరిగే ప్రదేశాల్లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈక్రమంలో ఉన్నతాధికారులు కూడా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో అయిదు రోజుల్లో అందాల పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో “ఆకేరు న్యూస్”.. ప్రత్యేక కథనం..
తొలి ప్రపంచ సుందరి ఎవరంటే..
ప్రపంచ సుందరి 72వ పోటీలకు హైదరాబాద్ భాగ్యనగరం వేదిక కానుంది. ఈ పోటీలు మొదటిసారి 1951లో ఇంగ్లండ్‌లో ప్రారంభమయ్యాయి. అదే దేశానికి చెందిన ‘ఎరిక్ మోర్లీ’ అందాల పోటీల సృష్టికర్త. 2000 సంవత్సరంలో ఎరిక్ మరణించిన తర్వాత ఆయన భార్య జులియా మోరీ ఈ పోటీలకు సారథ్యం వహిస్తున్నారు. స్వీడన్‌కు చెందిన మోడల్, కికి హకాన్సన్ 1951లో తొలి ప్రపంచ సుందరిగా ఎంపిక అయ్యారు. 2000 సంవత్సరం తర్వాత ఈ పోటీలను కేవలం శారీరక సౌందర్యానికి మాత్రమే పరిమితం చేయకుండా మహిళలకు సాధికారత కల్పించే ప్రయత్నంగా చూపించటం మొదలుపెట్టారు. ఒక వ్యక్తికి ఉన్న సామాజిక బాధ్యతను గుర్తుచేసే విధంగా… ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే నినాదాన్ని బాగా ప్రచారంలోకి తీసుకువచ్చారు.
దేశం నుంచి ఆరుగురు అందగత్తెలు..
ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొని భారత దేశం నుంచి ఆరుగురు ప్రపంచ సుందరులుగా ఎంపికయ్యారు. వారిలో
రీటా ఫారియా (1966), ఐశ్యర్యా రాయ్ (1994), డయానా హెడెన్ (1997), యుక్తా ముఖి (1999), ప్రియాంక చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017) ఉన్నారు. భారతదేశం 1996లో చివరిసారిగా ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యమిచ్చింది. ఈ పోటీలు 28 సంవత్సరాల విరామం తర్వాత 2024లో ముంబైలో జరిగాయి. ఈ ఏడాది ఇండియాలో జరగనున్నాయి.
తెలుగు రాష్ట్రంలో మొదటిసారిగా..
ఈసారి ప్రపంచ సుందరి పోటీలకు భాగ్యనగరం వేదిక కానుంది. మే 7 నుంచి 31 వరకు జరిగే ఈ అందాల పండుగ ఏర్పాట్లను చాలా రోజుల నుంచే మొదలుపెట్టారు. ఈ పోటీలపై అందరిలోనూ ఆసక్తి పెరిగేలా ప్రచారం చేపడుతున్నారు. ప్రపంచ సుందరి పోటీలను భారత్‌లో నిర్వహించటం ఇది మూడవసారి కాగా, తెలుగు రాష్ట్రాలలో జరగటం ఇదే మొదటిసారి. ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొంటారు. విశ్వనగరానికే చెందిన డయానా డెన్ 1997లో ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు ప్రపంచ సుందరి పోటీలు విశ్వనగరంలోనే జరుగుతుండడం ఆసక్తిగా మారింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపూ హైదరాబాద్ పైనే పడింది.
విమర్శలు.. ఆందోళనలు..
ప్రపంచ సుందరి పోటీలపై మొదట్లో విపరీతమైన విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఈ విమర్శలు ఈ అందాల పోటీల ఆదరణను ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. 1990వ దశకంలో సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో మన దేశంలో కూడా ఈ పోటీల పట్ల పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న పోటీలపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు, కమ్యూనిస్టులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈపోటీలపై సిపిఐ నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అందాల పోటీలు నిర్వహించడం, స్త్రీ జాతిని అవమానించడమేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్త్రీ జాతిని అవమాన పరుస్తూ అందాల పోటీలు నిర్వహించడం చూస్తుంటే ఆడవాళ్లను బజారులో పెట్టి అమ్మే పద్ధతిలో ఉందన్నారు. ఒకపక్క ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
…………………………………………………..
