* ప్రాణం తీసిన లోన్ యాప్
* కరీంనగర్లో వ్యక్తి బలవన్మరణం
ఆకేరు న్యూస్, కరీంనగర్: లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. టూ టౌన్ సీఐ విజయ్ కుమార్ కథనం మేరకు.. నగరంలోని పోచమ్మవాడకు చెందిన గూడ సతీష్ రెడ్డి జ్యోతినగర్ లో ఉన్న తన వ్యాపార సముదాయం కోసం లోన్ తీసుకున్నాడు. వ్యాపారం సజావుగా సాగకపోవడంతో ఈఎంఐలు కట్టడంలో అంతరాయం ఏర్పడింది. దీంతో రుణయాప్ నిర్వాహకులు ఫోన్, వాట్సాప్ ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో అతడి షాపులోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య ఆమని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
* పెద్దపల్లి జిల్లాలో మరో యువకుడి ఆత్మహత్యాయత్నం..
రుణయాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన తూండ్ల శ్రీనివాస్ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి వ్యక్తిగత అవసరాల నిమిత్తం రుణయాప్‌ల ద్వారా రూ.4లక్షలు అప్పుచేశాడు. అప్పుతీర్చడంలో జాప్యం జరగడంతో రుణ యాప్ సిబ్బంది వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో బుధవారం అర్ధరాత్రి కొలనూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని వారు చెప్పారు.