* ఆకతాయిల ఫేక్ ఫోన్ కాల్స్ కు ఆగమాగం
* విమానాల దారి మళ్లింపు.. అత్యవసర ల్యాండింగ్‌లు
* విమాన ప్రయాణికులకు ముచ్చెమటలు
* అత్యవసర పనులకు ఆటంకాలు
* సీఐఎస్ఎఫ్, బాంబ్ స్వ్కాడ్, పోలీసులకూ ఇక్కట్లు
* 2 రోజుల వ్యవధిలోనే 10 విమానాలకు బాంబు బెదిరింపులు
* నిందితులపై కఠిన చర్యలున్నాయా?
* తీవ్రంగా పరిగణించాలంటున్న ప్రయాణికులు
(ఆకేరు న్యూస్ స్పెషల్ స్టోరీ)
జైపూర్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పైలట్లు విమానాన్ని అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సీఐఎస్ఎఫ్, బాంబ్ స్వ్కాడ్, స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) సైతం విమానాశ్రయానికి చేరుకున్నది. విమానంలో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. బాంబు తాలూకు ఆనవాళ్లు లేవు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. టైం గాడ్.. అనుకున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది.
అయితే.. ఆ సమయంలో విమానంలో 139 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో బాంబు ఉందన్న ప్రచారం, అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయడం, అధికారుల హడావిడి చూస్తున్న ఆ ప్రయాణికులు ఎంతలా ఆందోళన చెంది ఉంటారు. వారిలో ప్రముఖులు, అత్యవసర పనుల నిమిత్తం విమానంలో ప్రయాణిస్తున్న వారూ ఉంటారు. ఎవరో ఆకతాయి చేసిన పనికి కాసేపు గందరగోళానికి గురయ్యారు. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయడానికి అధికారులు సైతం ఎన్నో ఏర్పాట్లు చేశారు. తనిఖీల కోసం భారీ ఎత్తున భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. ఇదంతా ఓ ఆకతాయి చేసిన పనికి మానసికంగా, ఆర్థికంగా చెల్లించుకోవాల్సి వచ్చిన భారీ మూల్యం. అలాంటి నిందితులపై ఎలాంటి చర్యలు ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మళ్లీ.. మళ్లీ..
విమానాల్లో బాంబు బెదిరింపులు సర్వసాధారణంగా మారుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే పది విమానాలకు బెదిరింపులు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో ఓ వ్యక్తి.. తనను విమానం ఎక్కనివ్వలేదని విమానంలో బాంబు ఉందని పోలీసులకు ఫోన్ చేశాడు. చెన్నైకి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ డయల్ 100కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. వెంటనే సీఐఎస్ఎఫ్, శంషాబాద్ పోలీసులు అప్రత్తమయ్యారు. ఆ తర్వాత ఎక్కడి నుంచి, ఎవరు ఫోన్ చేశారో ఆరా తీశారు. ఈ క్రమంలో భద్రయ్య అనే వ్యక్తి ఫోన్ చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకున్నది. అలాంటి వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోకపోవడం, కఠిన శిక్షలు ఉంటాయని ప్రచారం లేకపోవడంతో ఇలాంటివి పునరావృతమవుతూనే ఉన్నాయి.
48 గంటల్లో 10 విమానాలకు..
కేవలం 48 గంటల్లోనే 10 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం న్యూఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన విమానానికి సైతం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించి.. కెనడాలోని ఇకాలూయిట్ విమానాశ్రయానికి మళ్లించారు. అమెరికా వెళ్తున్న విమానంతోపాటు మొత్తం ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అమెరికా వెళ్తున్న విమానానికి మంగళవారం మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు వచ్చాయని గుర్తు చేశారు. ఈ విమానం ఈ రోజు తెల్లవారుజామున 3.00 గంటలకు ఢిల్లీ నుంచి యూఎస్‌లోని చికాగోకు బయలుదేరిందన్నారు. కొద్ది సేపటి తర్వాత బాంబు బెదిరింపు రావడంతో.. భద్రత కారణాల రీత్య కెనడాకు దారి మళ్లించేందుకు నిర్ణయించామని అధికారులు ప్రకటించారు. ఇక సౌదీ అరేబియాలోని డమన్ నుంచి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు బయలుదేరిన ఇండిగో విమానానికి సైతం బాంబు బెదిరింపు రావడంతో.. జైపూర్‌లో అత్యవసరంగా దింపివేసినట్లు తెలిపారు. ఢిల్లీ – షికాగో, మధురై – సింగపూర్, ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లిన విమానానికి, అంతకు ముందు మస్కట్, జెడ్డాకు వెళ్లాల్సిన విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
తీవ్రంగా పరిగణించాల్సిందే..
బాంబు బెదిరింపులు వచ్చిన విమానాల్లో అంతర్జాతీయ విమానాలు సైతం ఉన్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా బెదిరింపుల వల్ల మొత్తం విమానయాన వ్యవస్థ ఆగమాగం అవుతోంది. ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వస్తోంది. విమానాల దారి మళ్లింపు.. అత్యవసర ల్యాండింగ్‌లు చేయాల్సి వస్తోంది. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణికులు మానసికంగా భయాందోళనలకు గురవుతున్నారు. విమాన ప్రయాణికులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈక్రమంలో ఇటువంటి కాల్స్ ను తీవ్రంగా పరిగణించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
…………………………………….