
* మూడు నుంచి నాలుగు నెలలు సిటీకి అతిథులు..
ఆకేరు న్యూస్ స్పెషల్ స్టోరీ
లవ్ బర్స్డ్ కు నిజమైన నిదర్శనం. జంటగానే ప్రయాణిస్తాయి. జంటగానే కలిసి ఉంటాయి. దేశంలో ఈ పక్షులు ప్రధానంగా హిమాలయాల పర్వత ప్రాంతాలలో, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, పశ్చిమ కనుమలలో కనిపిస్తాయి. అయితే.. అవి జంటగా ఈ సీజన్లో హైదరాబాద్‌కు వస్తాయి. ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుని పిల్లలను కంటాయి. వర్షాలు పడే సమయానికి కుటుంబం మొత్తం స్వస్థలాలకు ఎగిరిపోతాయి. ఆ జంట పక్షుల పేరే హార్న్ బిల్.
భారతదేశంలో అతిపెద్ద హార్న్‌బిల్ జాతి అయిన గ్రేట్ హార్న్బిల్స్ను గ్రేట్ ఇండియన్ లేదా గ్రేట్ పైడ్ హార్న్బిల్స్ అని కూడా పిలుస్తారు. ఈ జాతి పక్షులు జంటగానే ప్రయాణిస్తాయి. జంటగానే కలిసి ఉంటాయి. ఎండిపోయిన పొడవాటి చెట్లు, ఎండిపోయిన మైదానాలు, అడవి ప్రాంతాలు ఆవాసంగా చేసుకుంటాయి. అయితే, ఫిబ్రవరి నుంచి మే నెలలో ఇవి హైదరాబాద్‌లో కూడా కనిపిస్తాయి. మూడు నుంచి నాలుగు నెలల పాటు ఇవి హైదరాబాద్ కు అతిథులు. ఏటా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ, చిలుకూరు జింకల పార్కు, పీరంచెరువు వంటి పెద్ద చెరువులు వద్ద కనిపిస్తాయి. గత నెలలో గండిపేట మండలంలోని పీరంచెరువులో ప్రకృతి ప్రేమికులు, బర్డ్ వాచర్స్ ఈ పక్షుల ఫొటోలను తమ కెమెరాల్లో బంధించారు.
హార్న్‌బిల్ జంట గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటిని వెదుక్కుంటూ హైదరాబాద్ వస్తాయని పక్షి ప్రేమికులు పేర్కొంటున్నారు. ప్రకృతి ప్రేమికుల గ్రూప్‌లో సభ్యుడైన హైదరాబాద్‌లోని ప్రముఖ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ సుదర్శన్ ఈ జంట పక్షులను వికారాబాద్‌లో తన కెమెరాలో బంధించారు. చెట్టు తొర్రలో పక్షిగుడ్లు పెడితే మగపక్షి ఆహారం తీసుకొస్తుంది. గుడ్లు పొదిగి పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబం అంతా కలిసి ఎగిరిపోతాయని ఆయన తెలిపారు.దాని పెద్ద పరిమాణం, రంగు, మరియు అనేక గిరిజన సంస్కృతులు మరియు ఆచారాలలో దీని ప్రాముఖ్యత కారణంగా , కేరళ ప్రభుత్వం దీనిని అధికారిక కేరళ రాష్ట్ర పక్షిగా ప్రకటించింది.
…………………………………………