* అమానవీయ ఘటనలు
* కలకలం రేపుతున్న దారుణాలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల వరుసగా జరుగుతున్న హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. డబ్బు కోసం, ఆస్తి తగాదాలు, ఆర్థిక లావాదేవీల్లో తేడాలతో కర్కశత్వంగా చంపేస్తున్నారు. ఒకటి.. రెండు కాదు.. పదుల సంఖ్యలో కత్తిపోట్లు పొడిచి పొడిచి మరీ హతమారుస్తున్నారు. కుటుంబ పెద్దలు, అల్లారు ముద్దగా పెంచుకున్న పిల్లల మృతితో ఆయా కుటుంబాల్లో తీరని శోకం మిగులుతోంది.
మొన్నటికి మొన్న ..
కుషాయిగూడ హెచ్‌బీ కాలనీలో శుక్రవారం స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. పి.శ్రీకాంత్‌రెడ్డి(45), ధన్‌రాజ్ (40) స్నేహితులు. రియల్ ఎస్టెట్తో పాటు ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు. కొంత కాలంగా ఇద్దరి మధ్య ఆర్థిక, వ్యాపార విభేదాలు వచ్చాయి. ఈ విషయాలు మాట్లాడుకునే క్రమంలో సాయంత్రం శ్రీకాంత్‌రెడ్డి, ధన్‌రాజ్ మంగాపురంలోని శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయంలో మద్యం తాగారు. మాటామాట పెరిగి ఇద్దరి మధ్య వ్యాపార, ఆర్థిక లావాదేవిలలో వాగ్వావాదం జరిగినట్లు సమాచారం. దీంతో ఘర్షణ పడ్డ వారు పెనుగులాటలో బయటకు వచ్చారు. రోడ్డుపై శ్రీకాంత్‌రెడ్డిని ధన్‌రాజ్ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు.
మూడు రోజుల క్రితం..
మూడు రోజుల క్రితం కూకట్‌పల్లిలో దారుణ హత్య వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బంగారం, డబ్బు కోసం ఇద్దరు జార్ఖండ్ యువకులు ఇంటి యజమానురాలు రేణు అగర్వాల్‌ను కుక్కర్‌తో కొట్టి, కత్తితో గొంతుకోసం పొడిచి హత్య చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈ ముఠా తమ పథకాన్ని అమలు చేసింది. రాకేష్ ఇంట్లోకి వెళ్లిన ఇద్దరూ.. ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్ నోట్లో దుస్తులు కుక్కి కాళ్లు చేతులు కట్టేశారు. లాకర్ తాళాలు ఎక్కడున్నయో చెప్పాలని, ఎక్కడెక్కడ డబ్బు, బంగారం ఉందో చెప్పాలని చిత్రహింసలు పెట్టారు. సుమారు గంటకుపైగా ఆమెను చిత్రహంసలు పెట్టినా నోరు విప్పకపోవడంతో ఆగ్రహానికి గురైన దుండగులు కుక్కర్‌తో ఆమెతలపై బలంగా మోదారు. ఆపై కత్తితో ఆమె గొంతుకోసి విచక్షణా రహితంగా పొడిచి చంపేశారు. అనంతరం ఇంట్లోనే స్నానం చేసి, ట్రావెల్ బ్యాగుతో యజమాని స్కూటీపై పారిపోయారు.
అంతకు ముందు..
రేణు అగర్వాల్ హత్యకు వారం రోజుల ముందే కూకట్‌పల్లిలో సహస్ర అనే బాలిక హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్యాట్ దొంగతనానికి వెళ్లిన 14 ఏళ్ల బాలుడు.. బాలికను హత్య చేశాడు. పక్కింట్లో నుంచి ఆ ఇంటి పైకి దూకి బ్యాట్ దొంగిలించే క్రమంలో చూసిన బాలికను దారుణంగా చంపేశాడు. కూకట్పల్లి హత్యకేసులో 14ఏళ్లు కూడా నిండని నిందితుడు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసి ఒక ప్లాన్ తయారుచేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న కొన్ని హింసాత్మక ఘటనలలో దృశ్య మాధ్యమాలు ప్రేరణగా నిలిచాయని పోలీసు విచారణలో తేలింది.
ఇవే కాదు..
తెల్లాపూర్‌లో ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు. అమీన్పూర్లో ముగ్గురు పిల్లలకు విషం పెట్టి చంపిన తల్లి. బెట్టింగ్ ఆడొద్దు అన్నందుకు సర్ప్రైజ్ అంటూ తండ్రి గొంతులో కత్తిదించిన కుమారుడు. అనుమానంతో భార్యను ముక్కలుముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించిన అమానవీయ ఘటన ఒకటైతే.! మరొకరిమీద ఇష్టంతో భర్తను కిరాయిమూకతో చంపించిన కేసు మరొకటి. కుటుంబ కలహాలతో చిన్నారులను బలిపెడుతున్న తల్లిదండ్రులు. గట్టుతగాదాలలో తోడబుట్టినవారని కూడా చూడకుండా ఒకరినొకరు చంపుకొంటున్న అన్నదమ్ములు. కారణాలు ఏమైనా దారుణంగా చంపేస్తున్నారు. ఇదివరకు హత్యలు అనగానే రౌడీలు, గూండాలే గుర్తొస్తారు. ఇప్పుడు కంటిరెప్పను, వెంటనీడను కూడా అనుమానించాల్సిన దుస్థితి. కూకట్‌పల్లికి చెందిన పదేళ్ల చిట్టితల్లిని పొరుగున ఉండే ఓ పదోతరగతి విద్యార్థి 20కుపైగా కత్తిపోట్లతో పొట్టనబెట్టుకున్న ఘటన యావత్ సమాజాన్ని ఉలికిపడేలా చేసింది. ఇలాంటి వరుస ఘటనలతో మనుషుల్లో ఇంతటి కాఠిన్యం ఎందుకు మీరుతుందన్న ఆందోళన బయలుదేరింది.
…………………………………….
