
* హైడ్రా కమిషనర్ రంగనాథ్
* విధులను బహిష్కరించిన హైడ్రా మార్షల్స్
ఆకేరున్యూస్ , హైదరాబాద్ : హైడ్రా మార్షల్స్ విధుల బహిష్కరణ వ్యవహారం టీ కప్పులో తుఫాన్ లాంటిదని హైడ్రా కమిషనర్ రంగనాధ్ అన్నారు. సమాచార లోపం వల్లే ఇదంతా జరిగిందని రంగనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ జీతాలను తగ్గించిందని హైడ్రా మార్షల్స్ సోమవారం విధులను బహిష్కరించారు.తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం, హైడ్రా ఉద్యోగుల (HYDRA employees) జీతాలను రూ. 7,000 వరకు తగ్గించారు. ఈ నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేసిన హైడ్రా మార్షల్స్, నిరసనగా విధులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ బహిష్కరణ ప్రభావం వెంటనే కనిపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సాయానికి వెళ్లే 51 హైడ్రా వాహనాలు ఆగిపోయాయి. హైడ్రా కంట్రోల్ రూమ్ వద్ద వాహనాలు నిలిపివేయడంతో సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.
జీతాలు తగ్గే అవకాశమే లేదు
హైడ్రా మార్షల్స్ కు జీతాలు తగ్గే అవకాశమే లేదని హైడ్రా కమిషనర్ వివరణ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.హైడ్రాలో పనిచేస్తున్న వారి జీతాలు తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు. చిన్న అపోహ వల్ల ఇదంతా జరిగిందని అన్నారు. అందరికి అర్థం అయ్యేలా వివరించామని పేర్కొన్నారు. హైడ్రాలో పని చేస్తున్న మార్షల్స్కి ఇంకా జీతం పెరుగుతుందని రంగనాథ్ వెల్లడించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్(MA&UD) శాఖ కూడా.. జీతాలు పెంచే అంశంపై పరిశీలన చేస్తుందని తెలిపారు. హైడ్రా మార్షల్స్ పట్ల ఏ అధికారి అమర్యాదగా ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలా ఎవరైనా చేస్తే.. నేరుగా తన దృష్టికి తీసుకురావాలని భరోసా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కూడా సమీక్షించి అక్కడ పరిస్థితిని చూసి జీతాలు పెంచే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. ఎక్కువ గంటలు పనిచేస్తే.. ఓవర్ టైమ్ ఇవ్వాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తామని రంగనాథ్ వెల్లడించారు.
…………………………………….