
* సెలబ్రిటీగా చెప్పుకుంటూ మోసాలు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తాను ఫలానా ఎంపీ కొడుకుని.. లేదా తాను ఓ డాక్టర్ ని.. లేదా తను నగలవ్యాపారిని అని చెప్పుకుంటూ అమాయకులను మోసం చేస్తున్న ఓ ఘరానా మోసగాడిని కూకట్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన వాయిల వెంకటేశ్వర్లు అలియాస్ విక్రాంత్ రెడ్డి ఇంజినీరింగ్ పూర్తి చేసి కూకట్ పల్లిలో నివాసం ఉంటున్నాడు. కష్ట పడకుండా డబ్బు ఎలా సంపాదించాలో ఇతనికి వెన్నతో పెట్టిన విద్య.సినిమా ఫక్కీలో ఓ ఎంపీ కుమారుడిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. జనాలను నమ్మించడానికి తన చుట్టూ బౌన్సర్లను పెట్టుకున్నాడు. బయటకు వెళ్లినప్పుడు ఎంపీ కుమారుడినని చెప్పి స్థానిక పోలీసులను ఎస్కార్ట్గా వాడుకునేవాడు. కేపీహెచ్బీ పరిధిలోని ఒక మహిళా హాస్టల్ నిర్వాహకురాలితో పరిచయం పెంచుకున్నాడు. జూబ్లీహిల్స్లో తనకు బంగారు ఆభరణాల దుకాణం ఉందని నమ్మించి.. ఆమె దగ్గర నాలుగు తులాల బంగారు గొలుసు తీసుకున్నాడు. దానిని రీమోడలింగ్ చేయిస్తానని చెప్పి అదనపు బంగారం కోసం లక్ష రూపాయలు తీసుకొని ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిఘా పెట్టారు.ఈ క్రమంలోనే అతను డాక్టర్ ని అని నమ్మించి మియాపూర్లో ఒక యువతిని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు పెళ్లి చూపులకి ఆ యువతి ఇంటికి వెళ్లాడు. అప్పటికే అతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు పెళ్లి చూపులకని ఆ యువతి ఇంట్లో ఉండగా అరెస్ట్ చేశారు. ఇప్పటికే అతడిపై రెండు తెలుగు రాష్ఱాల్లో 14 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
………………………………