ఆకేరు న్యూస్, ములుగు: విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసి అమరులైన పోలీసులకు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అమరవీరుల కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీస్ అధికారులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ “ఈరోజు మనం పోలీస్ ఫ్లాగ్ డే ను గంభీరంగా పాటిస్తున్నామని మన దేశశాంతి భద్రత కోసం ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు. 1959 అక్టోబర్ 21 రోజు లడాకులోని హార్ట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దళాల దాడిలో పదిమంది ధైర్యవంతులైన భారతీయ పోలీసులు సరిహద్దులను కాపాడుతూ వీరమరణం పొందారు. ఆ ఘటన స్మారకార్థంగా ప్రతి సంవత్సరం ఈరోజు దేశవ్యాప్తంగా పోలీస్ ఫ్లాగ్ డే ని నిర్వహిస్తామని, ఈరోజు మనం తలవంచుకొని ఆ వీరుల త్యాగానికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. వారి పేర్లు స్మారక స్థూపాలపై చెక్కబడి ఉంచవచ్చు కానీ వారి ఆత్మ వారి ధైర్యం వారి సేవ మనందరిలో సజీవంగా ఉన్నాయి. పోలీస్ సేవ అనేది ఉద్యోగం కాదు అది ఒక బాధ్యత, త్యాగం ప్రజాసేవ పట్ల అంకితభావం. ప్రతి పోలీస్ అధికారి విధులకు బయలుదేరినప్పుడు భద్రత కోసం కృషి చేయడానికి తమ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజల భద్రత కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇదే మన వృత్తి యొక్క మహత్యం. ములుగు జిల్లా సవాళ్లతో కూడిన అడవి ప్రాంతాలు మావోయిస్టు ప్రభావిత మండలాలు సూదూర గ్రామాలు ఉన్నప్పటికీ మన సిబ్బంది ధైర్యంగా నిబద్ధతతో విధులను నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నిరోధం వరదలు అత్యవసర పరిస్థితులలో ప్రజలకు సహాయం చేయడంలో ములుగు పోలీసులు నిరంతరం ముందంజలో ఉన్నారు. ఈరోజు మనం పోలీస్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద నిలబడి త్యాగాన్ని స్మరించి వారి పరంపరను కాపాడటానికి మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం. మన బాధ్యతలను నిజాయితీ క్రమశిక్షణ కరుణ నైతిక భావంతో నిర్వర్తిద్దాం ఎందుకంటే మన అమరులు విలువల కోసం తమ ప్రాణాలను అర్పించారు. మన అమరుల కుటుంబాలకు మనస్ఫూర్తిగా మన గౌరవం సానుభూతి. మీ త్యాగం అమూల్యం. పోలీస్ విభాగం ఎల్లప్పుడూ మీతో తోడుగా ఉంటుంది. ఈరోజు మన బలం ఐక్యతలో ఉన్నది మన శక్తి నిజాయితీలో ఉన్నదని మన ధ్యేయం ప్రజాసేవలో ఉన్నదని గుర్తు చేస్తున్నది మన అమరుల త్యాగం మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ప్రజల భద్రత కోసం అదే ధైర్యం అదే అంకితభావంతో సేవ చేయడానికి మన ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి. జైహింద్” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
అనంతరం ములుగు డిఎస్పి రవీందర్ గారు 2024 సంవత్సరం నుండి 2025 వరకు దేశవ్యాప్తంగా ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల వివరాలను తెలియజేస్తూ వారికి స్మరిస్తూ నివాళి అర్పించారు. పోలీస్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్చంతో అమరవీరుల కుటుంబ సభ్యులు, జిల్లా పోలీస్ యంత్రాంగం, పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ పోలీస్ శాఖ తరపున బహుమతులు అందచేశారు.
ఈ కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులు, డి సి ఆర్ పి డి ఎస్ పి కిషోర్ కుమార్, ములుగు డిఎస్పి రవీందర్, సిఐలు శ్రీనివాస్ దయాకర్ సురేష్ రమేష్, ఆర్యలు స్వామి సంతోష్ తిరుపతి వెంకటనారాయణ, ఎస్సైలు ఆర్ఎస్ఐలు, పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.

………………………………………………………..
