Gold Found in Warangal Farm
* కూలీలకు దొరికిన నిధి
ఆకేరు న్యూస్, వరంగల్: అది సాధారణంగా పంటలు పండే పొలమే. కానీ, ఇప్పుడు ఆ భూమి వైపు చూస్తే అందరి కళ్లల్లో కాంతులు విరజిమ్ముతున్నాయి. ఎందుకంటే అక్కడ పంటతో పాటు ‘బంగారం’ కూడా మొలకెత్తుతోంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వరంగల్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇప్పుడు ఇదే అంశం తీవ్ర సంచలనంగా మారింది.
ఆ పొలంలో అడుగుపెడితే చాలు అదృష్టం వరిస్తుందని, లంకె బిందెలు దొరుకుతున్నాయనే వార్త కార్చిచ్చులా వ్యాపించడంతో జనం అక్కడికి పరుగులు తీస్తున్నారు.
* జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్..
వరంగల్ జిల్లా, చెన్నరావుపేట మండలం పరిధిలోని కోపాకులపాడు గ్రామంలో ఈ వింత వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఒక రైతుకు చెందిన ఆరెకరాల భూమి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 24న సదరు పొలంలో కూలీలు కలుపు తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. నేలను తవ్వుతుండగా అకస్మాత్తుగా మెరుస్తూ ఏదో వస్తువు కనిపించింది. దగ్గరికి వెళ్లి పరిశీలించగా అది అచ్చమైన బంగారమని తేలింది. కూలీలకు బంగారం దొరికిన విషయం క్షణాల్లో గ్రామం అంతటా పొక్కింది. ఈ నోటా ఆ నోటా పడి చివరకు పోలీసుల చెవిన పడటంతో వారు రంగప్రవేశం చేశారు.
* గతంలోనూ యజమానికి కూడా..
ఈ పొలంలో బంగారం దొరకడం ఇదే మొదటిసారి కాదని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో ఈ భూమి యజమానికి కూడా ఇలాగే పెద్ద మొత్తంలో బంగారం, పురాతన నాణేలు దొరికాయని గ్రామస్థులు బలంగా నమ్ముతున్నారు. ఆ సమయంలో ఆయన విషయాన్ని బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా దాచేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కౌలుకు తీసుకున్న వారికి, పనిచేసే కూలీలకు కూడా బంగారం దొరకడంతో.. ఆ ఆరెకరాల భూమి కింద ఏదో పెద్ద గుప్తనిధే దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికుల మాట.. “ఈ భూమి చుట్టుపక్కల ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి ప్రాచీన ఆలయాలు, చారిత్రక కట్టడాలు ఉండేవని మా పెద్దలు చెప్పేవారు. బహుశా నాటి రాజులు దాచిపెట్టిన నిధులు ఇక్కడ ఉండి ఉండవచ్చు.”
* భూమి కోసం ఎగబడుతున్న రైతులు..
ఈ వార్త బయటకు రావడంతో ఆ పొలానికి డిమాండ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. సాధారణంగా పంటల కోసం కౌలుకు తీసుకునే రేటు కంటే.. పదింతలు ఎక్కువ ఇచ్చేందుకైనా తాము సిద్ధమంటూ చుట్టుపక్కల రైతులు, వ్యాపారులు సదరు భూయజమాని వెంట పడుతున్నారట. “మాకు కౌలుకు ఇవ్వండి.. ఎంతైనా రేటు ఇస్తాం” అంటూ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కేవలం వ్యవసాయం కోసం కాకుండా, లోపల ఉన్న లంకె బిందెల కోసమే ఈ పోటీ నడుస్తోందని స్పష్టమవుతోంది.
* రంగంలోకి పోలీసులు, పురాతత్వ శాఖ..
బంగారం దొరికిన ఉదంతంపై సమాచారం అందుకున్న పోలీసులు కోపాకులపాడుకు చేరుకుని విచారణ జరుపుతున్నారు. కూలీలకు దొరికిన బంగారం ఎంత? అది ఏ కాలానికి చెందినది? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం కావడంతో పురాతత్వ శాఖ (Archaeology Department) అధికారులకు కూడా సమాచారం ఇచ్చే యోచనలో ఉన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమిలో దొరికే ఎలాంటి నిధులైనా ప్రభుత్వానికే చెందుతాయని, ఎవరైనా నిధుల కోసం తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, ఈ ‘బంగారు పొలం’ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
