
* యాంత్రికంగా మారిన జీవితాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : ఏ వయసు ముచ్చట ఆ వయస్సులో తీరాలి అంటారు పెద్దలు.. కానీ నేడు ఆ పరిస్థితులు లేవు కెరీర్..ఉద్యోగం అంటూ నేటి యువత .జీవితంలో చాలా ఆనందాలను కోల్పోతున్నారు.అ సలు పెళ్లే వద్దు అనే దాకా వచ్చింది. ఒక వేళ పెళ్లి చేసుకున్నా పిల్లలు వద్దు అనే వింత పోకడ మొదలైంది..నాన్న అనే పిలుపులో ఉండే ఆత్మీయత.. అమ్మా అనే పిలుపులో ఉండే కమ్మదనం ఏంటో ఈ జనరేషన్ కు అర్థం కావడంలేదు. అలసి పోయి వచ్చిన క్షణాల్లో పిల్లాడు వచ్చి గుండెల మీద పడుకొని చేసే అల్లరిని అనుభవిస్తేనే అర్థం అవుతుంది. అమ్మమ్మ ఇంటికి పోవడానికి ఎండాకాలం సెలవుల కోసం ఏడాది పొడవునే ఎదురు చూసే వాళ్లం.. అమ్మమ్మ పచ్చడితో అన్నం కలిపి పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని తిన్పిస్తుంటే.. ఆ అనుభవం చెప్పడానికి మాటలు చాలవు. ఆ దృశ్యాన్ని తలచుకుంటేనే ఎంతో మధురమైన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి ఫీలింగ్స్ ఇక వచ్చే జనరేషన్ లో కన్పించవేమో అన్పిస్తోంది.ఇప్పడు యువత ఆలోచనలే ఆ విధంగా ఉన్నాయి.సగం జీవితం గడిచిపోయాక పెళ్లి చేసుకొని సాధించేదేముందో అర్థం కావడం లేని పరిస్థితి ఉంది. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉండి కలో గంజో తాగి అయినా గంపెడు మంది పిల్లల్ని కని ఆనందంగా గడిపే వారు. నేడు భార్య భర్తలు ఇద్దరూ లక్షల్లో సంపాదిస్తున్నా ఒకర్ని కనడానకే వెనకాడుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఎలాగూ కనుమరుగయ్యాయి. బతుకంతా యాంత్రికంగా మారింది. ఒకప్పుడు చుట్టాలు వచ్చారంటే ఇల్లంతా సందడిగా పండగ వాతావరణం ఉండేది. చుట్టాలు వెళ్లిపోతున్నారనంటే మరో రెండు రోజులు ఉండి పొమ్మని బలవంతం చేసేవారు.ఉన్నంతలో చుట్టాలకు మర్యాదలు చేసి తృప్తి పడేవారు. ఇప్పుడు చుట్టాలు వస్తున్నారంటే భయపడుతున్నారు. ఎక్కడ తమ ప్రైవసీ కోత్పోతామనే భావనలో ఉంటున్నారు. సెల్‌ఫోనే జీవితం అయింది. ఒకప్పుడు పెద్దలు పెళ్లి చేసుకొని గంపెడు మంది పిల్లలను కనమని ఆశీర్వదించేవారు.ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని కనమని ఆశీర్వదిస్తున్నారు. రాను రాను పెళ్లయిన జంటలు ఒక్క సంతానానికే పరిమితమవుతున్నారు . కానీ ఇప్పుడు మేం పిల్లల్నే కనం అనే దాకా వచ్చింది పరిస్థితి. ఈ ప్రపంచం అంతం అయితే ఎలా ఉంటుందోనని ఊహించి యండమూరి వీరేంద్రనాధ్ యుగాంతం అనే నవల రాశారు. అప్పట్లో ఆ నవల చదవుతే భవిష్యత్ లో ఇలా జరుగుతుందా అని ఊహకలుగుతుంది.. ఇప్పుడు అదే నిజం అవుతుందా అని అన్పిస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో యువత పెళ్లిల్లు చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి విముఖత చూపుతున్నారట.అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్న జపాన్ లో ఇప్పడు దేశం అస్తిత్వం దెబ్బతినే పరిస్థితి ఉందంటున్నారు. అక్కడ యువత వర్క్ ప్రెజర్ వల్ల పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారట. తీవ్రమైన వర్క్ ప్రజెర్ తో మానసిక ఒత్తిడికి లోనై కుటుంబ జీవితానికి దూరమవుతున్నారు. రాబోయే ఉపద్రవాన్ని గుర్తించిన జపాన్ ప్రభుత్వం ఇప్పుడు యువతపై వర్క్ ప్రెజర్ తగ్గించి పెళ్లి చేసుకోండి పిల్లల్ని కనండి అని ప్రోత్సహిస్తోంది. రష్యా జర్మనీ లాంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల పిల్లల్ని కనండి అని ప్రోత్సహిస్తున్నారు.
సాఫ్ట్ వేర్ రంగంలో…
సాఫ్ట్ వేర్, ఐటీ నిపుణుల్లో పెళ్లిల్లపై ఆసక్తి ఉండడంలేదు. పని ఒత్తిడి వల్ల పెళ్లిపైనే ఆలోచన రావడం లేదు. దానికి తోడు గంటలకు గంటలు కంప్యూటర్ల ముందు కూర్చోవడంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొంత మందిలోనైతే సంసారిక జీవితాలపై ఆసక్తిపోతోంది.గంటలకు గంటలు ఆఫీస్ వాళ్లు ఇచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయడానికే సరిపోతోంది. దైనందిన జీవితానికి దూరం అవుతున్నారు. కుర్చీకే అతుక్కుపోయి నడుంనొప్పి.నరాల బలహీనత లాంటా వ్యాధులు తెచ్చుకుంటున్నారు. పరిస్థితులు ఇలా గే కొనసాగితే భవిష్యత్ ఊహించుకోవడానికే భయంగా ఉందని మేధావులు,సామాజిక విశ్లేలకులు అభిప్రాయపడుతున్నారు.
……………………………….