
* ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
* జూబ్లీహిల్స్ ఠాణాకు మాజీ ఐపీఎస్
* ప్రారంభమైన విచారణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(PHONE TAPPING CASE)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి తొలిసారిగా సిట్ విచారణకు హాజరయ్యారు. 14 నెలలుగా అమెరికాలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (PRABHAKAR RAO) ఆదివారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అమెరికాలో ఉంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయన పాస్‌పోర్టును రద్దు చేయించారు. సుప్రీంకోర్టు ఆయన పాస్‌పోర్టును పునరుద్ధరించి, వెనక్కి వచ్చేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన పోలీసు అధికారులు టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు తదితరులు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రభాకర్‌రావు వాంగ్మూలం కీలకంగా మారింది. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించుకున్న సిట్ అధికారులు.. వాటికి ప్రభాకర్ నుంచి సమాధానాలు రాబట్టనున్నారు. న్యాయావాదితో కలిసి జూబ్లీహిల్స్ (JUBILLIHILLS)ఠాణాకు చేరుకున్న ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారో తేలే అవకాశం ఉంది.
…………………………………………..