* కట్టా మనోజ్ రెడ్డి ఆక్రమించిన భూములను పేదలకు పంచాలి
* అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్
* అధికారులు ఇప్పుడైనా నిర్లక్ష్యాన్ని వీడాలి
* పేద ప్రజలకు ఆ భూమిని పంపిణీ చేయాలి
– సీపీఐ, ఎంఆర్ పీయస్ నేతల డిమాండ్
ఆకేరు న్యూస్, వరంగల్ ప్రతినిధి : అసైండ్ భూమి హాం ఫట్ కాంగ్రెస్ లీడర్ మాయాజాలం .. అంటూ ఆకేరు న్యూస్ చానల్లో వచ్చిన కథనం ఇపుడు అసెంబ్లీని తాకింది. హనుమకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైండ్ భూమిని కట్టా మనోజ్ రెడ్డి అనే భూస్వామి కబ్జా చేసిన అంశాన్ని ఆకేరు న్యూస్ వెలుగులోకి తీసుకువచ్చింది. 138 ఎకరాలు ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తే అందులో ఏకంగా వంద ఎకరాలు కబ్జాకు గురయినట్లు తేలింది. దీంతో తన పేరుతో తమ కుటుంబ సభ్యులు, సమీప బంధువుల పేర్లతో కట్టా మనోజ్ రెడ్డి పట్టా చేయించుకున్నారని సీపీఐ, ఎంఆర్ పీయస్ నాయకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని మంగళవారం అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఆ పేదలకు చెందే విదంగా చూడాని ఆయన కోరారు.. అదే విదంగా హసన్ పర్తి మండలం ముచ్చర్ల గ్రామంలో దళితులకు కేటాయించిన భూమిని ఒక వ్యక్తి పట్టా చేయించుకున్నారు. స్థానిక ప్రజలు ఆందోళనలు చేపడితే ఆ పట్టాలు రద్దు చేశారు.. కాని తిరిగి పేద ప్రజలకు పంపిణీ చేయడం లేదు. వరంగల్ నగర శివారు ప్రాంతంలో ఆ భూములు ఉండడం వల్ల ఆ భూములకు కోట్లల్లో ధరలు పలుకుతున్నాయి. దీంతో ఆ భూములను తిరిగి దళితులకు అప్పగించడానికి అధికారులు ముందుకు రావడం లేదన్నారు. ఆ భూములను కూడా వెంటనే అర్హులైన స్థానిక దళితులకు అప్పగించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
* వెంకటాపూర్ అసైండ్ భూమి అసలు కథ ఏంటంటే..?
హనుమకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో పింగిళి మధుసూదన్ రెడ్డి అనే భూస్వామి నుంచి 138 ఎకరాలు 32 గుంటల సీలింగ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ఆ భూమిని 1994 సంవత్సరంలో 73 మంది పేదలకు అసైన్మెంట్ చేశారు. మూడు దశాబ్దాలు గడిచినా తమ పేరుతో ఇక్కడ భూములున్నాని ఆ గ్రామంలోని చాలా మంది లబ్దిదారులకు తెలియక పోవడం విశేషం. అదే గ్రామానికి చెందిన భూస్వామి కాంగ్రెస్ నేత కట్టా మనోజ్ రెడ్డి రెవిన్యూ అధికారులను ప్రభావితం చేసి అసైండ్ భూములను తన పేరుతో తమ కుటుంబ సభ్యుల పేర్లతో పట్టాలు చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన స్థానిక పేదలు సీపీఐ అద్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.జిల్లా ఉన్నతాధికారులను కలిసి ఎన్నో సార్లు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. అయినప్పటికీ ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది. రెవిన్యూ అధికారుల అవినీతి వల్లనే అసైండ్ భూమి భూస్వాములకు పట్టాలు అయినాయని సీపీఐ నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలని ఎంఆర్పీయస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ధరణి లో అనేక అక్రమాలు జరిగాయని రైతులు అపార నష్టం జరిగిందని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు. ధరణిలోని లోపాలను సరి చేసి రైతులు, పేదల భూములను కాపాడాలని సీపీఐ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు, కర్రె బిక్షపతి, ఏదునూరి వెంకట్రాజం , కొట్టెపాక రవి లతో పాటు ఎంఆర్ పీయస్ రాష్ట్ర నాయకులు మంద కుమార్ మాదిగ తదితరులు డిమాండ్ చేశారు.
———————————
