* దీపావళి నుంచి దీపం పథకం ప్రారంభం
* ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ
* టెక్నాలజీ వినియోగంతో నేరస్తుల ఆటకట్టు
* 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కల సాకారం కావాలి
* రెండేళ్లలో పోలవరం పూర్తి
* ఎంత చేసినా ప్రజలు అప్పుడప్పుడు నన్ను మరచిపోతున్నారు
* నన్ను మరచిపోతే భూతం వస్తుంది..
* ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
* మచిలీపట్నంలో స్వచ్ఛతా హి కార్యక్రమానికి హాజరు
ఆకేరు న్యూస్, మచిలీపట్నం : ఏపీ(Ap)లో నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chief Minister Chandrababu Naidu) ప్రకటించారు. ఎక్కడా పన్ను వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. కేబినెట్ సమావేశంలో కూడా దీన్ని ఆమోదిస్తామని వెల్లడించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నం(Machilipatnam)లో నిర్వహించిన స్వచ్ఛతా హి కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో పోలవరం పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. సుందర నగరంగా రాజధాని అమరావతిని తీర్చదిద్దుతానని వెల్లడించారు. నేరస్తుల ఆటకట్టించేందుకు టెక్నాలజీని వినియోగిస్తామని, ఎవరైనా తోక ఎగరేస్తే కట్ చేస్తామని హెచ్చరించారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పెడుతున్నామన్నారు. ఎవరైనా నేరం చేస్తే నిమిషాల్లో పట్టుకునే టెక్నాలజీ తమ దగ్గర ఉందన్నారు.
మూడు గ్యాస్ సిలిండర్లు
2029కల్లా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కల సాకారం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దీపావళి(Deepavali) నుంచి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం(Gas Cylinders Free)గా ఇచ్చే దీపం పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. 2027కు ప్రతి ఒక్క ఇంటికీ నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తామన్నారు. వరదల్లో డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందించామని గుర్తు చేశారు. మీ పుట్టినరోజుకు, మీ బిడ్డ పుట్టినరోజుకు, మీ పెద్దలను గుర్తుంచుకునే సమయంలో ఇలా.. ప్రతీ సందర్భంలో ఒక మొక్క నాటాలని ప్రజలకు పిలపునిచ్చారు. గత ప్రభుత్వం చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని విమర్శించారు. బుడమేరు(Budameru) కోసం 2019లో తాము విడుదల చేసిన నిధులు ఖర్చు చేయలేదన్నారు. తాను ఎంత చేసినా ప్రజలు అప్పుడప్పుడు తనను మరచిపోతున్నారని, తనను మరచిపోతే భూతం వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
………………………….