* మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఆకేరున్యూస్, వరంగల్్: వరంగల్ ఆజంజాహి మిల్లు కార్మికుల భవనాన్ని ప్రముఖ వ్యాపారవేత్త అక్రమంగా చేజిక్కించుకొని వాణిజ్య భవనాన్ని నిర్మించుటకు ప్రయత్నిస్తున్న వారిపై ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. 1937లో అజాంజాహి మిల్లు కార్మికులు అందరూ నగదు రూపెన చందాలు పోగు చేసుకొని మిల్లు స్థలంలో కార్మిక భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారని.. అప్పటినుండి గత సంవత్సరం వరకు సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ నాయకుల అండదండలతో కార్మికులకు సంబంధించిన భవనాన్ని అక్రమంగా చేజ్కించుకున్నారని.. 324 మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ కార్మికులకు అండగా నిలుస్తామన్నారు. గతంలో వ్యాపారవేత్త అయిన కాశం నమశ్శివాయ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాపై పార్టీపై బురదజల్లడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు మేము అతన్ని నిలదీశామని.. అప్పుడు భవనాన్ని చేజిక్కించుకొనే ప్రయత్నం విరమించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ నాయకుల అండదండలతో భూమిని మళ్లీ స్వాధీన పర్చుకున్నారన్నారు. ఈ విషయమై బిఆర్ఎస్ పార్టీపరంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆ స్థలంలో అజంజాహి మిల్లు కార్మిక భవనం ఏర్పాటు అయ్యేవరకు కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. వాణిజ్య భవనానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఖాళీ స్థలాలను కబ్జా చేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని నరేందర్ పేర్కొన్నారు.
……………………………………………………..