* వరద నష్టం అంచనాపై అధికారులకు సీఎం హెచ్చరిక
* రేపు వరంగల్ లో ఏరియల్ సర్వేకు ఏర్పాట్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మొంథా తుఫాను ప్రభావంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanthreddy) సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా వల్ల ఎక్కడ ఎంత నష్టం జరిగిందో 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని, నిర్ణీత గడువులోగా స్పందించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్‌హాల్స్‌కు తరలించాలని ఆదేశించారు. పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని అన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని నియమించాలని, ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి 24 గంటలకోసారి కలెక్టర్‌కు రిపోర్టు చేరాలని సూచించారు. ధాన్యం కొనుగోలుపై రిపోర్ట్ ఇవ్వని అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని స్ఫష్టం చేశారు. వరదలకు దెబ్బతిన్నరోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడూ పరిశీలిస్తుండాలని, చెరువులు, వాగులు, కల్వర్టుల వద్ద ప్రజలను ముందుగానే అలర్ట్ చేయాలని సూచించారు. కాగా, తుఫానుతో తీవ్ర ప్రభావితమైన వరంగల్(Warangal), హుస్నాబాద్ ప్రాంతాల్లో రేపు సీఎం పర్యటించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswararao), పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ(Konda Surekha), వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
…………………………………………….
