Jr.NTR personality rights case
* అనుమతి లేకుండా వాడితే కఠిన చర్యలు
ఆకేరు న్యూస్, డెస్క్: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత హక్కుల (Personality Rights) రక్షణ కోసం కీలకమైన న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. తన అనుమతి లేకుండా తన పేరు, గొంతు, ఫోటోలు లేదా ఇతర డిజిటల్ కంటెంట్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరూ వాడకుండా నిషేధించాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు (సోమవారం) జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం విచారణ జరపనుంది.
* పర్సనాలిటీ రైట్స్ అంటే..
ఒక సెలబ్రిటీకి ఉన్న గుర్తింపును, వారి అనుమతి లేకుండా ఇతరులు వ్యాపార ప్రకటనల్లో లేదా సోషల్ మీడియా ప్రమోషన్లలో వాడుకోకుండా ఉండేందుకు ఈ ‘పర్సనాలిటీ రైట్స్’ రక్షణ కల్పిస్తాయి. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అనిల్ కపూర్ వంటి దిగ్గజ నటులు తమ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించి అనుకూలమైన ఉత్తర్వులు పొందారు. ఇప్పుడు అదే బాటలో ఎన్టీఆర్ కూడా తన ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
* ఎన్టీఆర్ పిటిషన్.. కొత్త రచ్చ
ఎన్టీఆర్ తన పిటిషన్లో తన పేరు, ఫోటోలు, సంతకం, స్వరం (Voice) మరియు ఇతర డిజిటల్ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. వీటిని వాడి అనేక సంస్థలు లేదా వ్యక్తులు లాభపడుతున్నారని, ఇది తన వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా తన ఇమేజ్ను వాడితే కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ విచారణతో సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త చర్చ మొదలైంది. ఒకవేళ కోర్టు ఎన్టీఆర్‌కు అనుకూలంగా తీర్పునిస్తే, అనుమతి లేకుండా ఆయన పోస్టర్లు వేయడం లేదా ఏఐ (AI) టెక్నాలజీతో ఆయన స్వరాన్ని వాడటం నేరం కానుంది. నేడు జరగనున్న విచారణపై అటు సినీ వర్గాలు, ఇటు నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

1 thought on “ACTOR JR.NTR | పర్సనాలిటీ రైట్స్ కోసం వార్..”