
adilabad building Collapsed
* 75 ఏళ్ళ భవనం – భయం నీడలో ఉద్యోగులు
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనం ( Adilabad Collectorate Building ) ఒక్కసారిగా కుప్ప కూలింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupally krishna rao ) నిర్వహించే సమీక్షా సమావేశం కోసం అందులో కూర్చుని అధికారులు ఎదురు చూస్తున్నారు. భవనం పైకప్పు నెమ్మదిగా కూలుతుండడాన్ని గమనించిన అధికారులు అందులో నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.


* 75 ఏళ్ళ భవనం – భయం నీడలో ఉద్యోగులు
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనం నిజాం కాలంలో నిర్మించబడింది. ఆసీఫాబాద్ పట్టణం నుంచి జిల్లా కార్యాలయాల మార్పులో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కూడా ఇక్కడికి చేరింది. ఇపుడు కలెక్టరేట్ కార్యాలయం నిర్వహిస్తున్న ఈ భవనం నిజానికి 1941లో నిర్మాణం మొదలయింది. 1948 లో జిల్లా కార్యాలయాలన్నీ ఆసీఫా బాద్లోనే కొనసాగేవి. ఇపుడు కూలిన ఈ భవనం 1950 లో భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన తర్వాత ప్రారంభమయింది. 75 ఏళ్ళ పురాతన భవనం కావడంతో చాలా కాలంగా భవనంలోని పై కప్పు పెచ్చులు ఊడి పడుతుండేవి. ఉద్యోగులు బిక్కు- బిక్కు మంటూ ఉద్యోగాలు చేసేవారు. వర్షా కాలం వచ్చిందంటే చాలు ఈ భవనం ఎప్పుడూ నేల మట్టమవుతోందోనన్న భయాందోళనలో ఉద్యోగులు ఉండేవారు. గురువారం భవనం కూలిపోయినప్పటికీ ఎలాంటి ప్రాణం నష్టం లేక పోవడంతో జిల్లా అధికారులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం ఏమాత్రం పురోగతిలో లేదు. ఇదే కలెక్టరేట్ కార్యాలయంలో కొనసాగుతున్న ఇతర కార్యాలయాల ఉద్యోగులు సైతం భయం నీడలో ఉన్నారు. వెంటనే సురక్షిత భవనాల్లోకి కార్యాలయాలను మార్చాలని వారు కోరుతున్నారు.
———————————————-