
* భారీ భూకంపంతో అతలాకుతలం
* భారీగా ప్రాణ నష్టం
ఆకేరు న్యూస్‌డెస్క్: భారీ భూకంపంతో అప్ఘనిస్తాన్ తల్లడిల్లింది. అప్ఘనిస్తాన్ లోని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం కునార్ ప్రావిన్స్ లో రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రత నమోదయింది. ఈ విపత్తులో వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అధికార మీడియా సంస్థ రేడియో టెలివిజన్ అఫ్గానిస్థాన్ ప్రకారం 600 మందికి పైగా మృతిచెందగా మరో 1500 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే భూకంపాని సంబంధించినపలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితులకు అత్యవసర సహాయం అందించాల్సిందిగా నెట్ జెన్లు పోస్టు పెడుతున్నారు. అప్ఘనిస్తాన్ లోని పలు గ్రామాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయని వార్డక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫారీ ఓ పోస్టులో తెలిపారు.కునార్, నోరిస్థాన్, నంగర్హార్ ప్రావిన్స్‌లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇదిలా ఉండగా ఇళ్లు కూలిపోయి శిథిలాలు మీద పడి వృద్ధులు చిన్నపిల్లలు గాయపడ్డారు. శిథిలాల కింద మృత దేహాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇళ్లు నేలమట్టం కావడంతో చాలా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.
………………………………………