జీడి సోమయ్య
* ఏఐఏఆర్ఎల్ఏ (AIARLA) 8వ జాతీయ మహాసభలు
* ఉపాధి హామీ పథకం నిర్వీర్యంపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం
ఆకేరు న్యూస్, పాలకుర్తి: వ్యవసాయ, గ్రామీణ కార్మికుల హక్కుల సాధన కోసం నిర్వహించనున్న అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం (AIARLA) 8వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా నాయకులు జీడి సోమయ్య పిలుపునిచ్చారు. జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలోని గిరిడి (Giridih)లో ఈ నెల 20, 21, 22 తేదీల్లో మూడు రోజులపాటు జాతీయ మహాసభలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం పాలకుర్తి మండల కేంద్రంలో మహాసభల ప్రచార కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీడి సోమయ్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వ్యవసాయ, గ్రామీణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను మహాసభల్లో రూపొందించనున్నట్లు వెల్లడించారు.
ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించే ఈ జాతీయ మహాసభలు వ్యవసాయ కార్మికుల హక్కుల సాధనలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కార్మికుల పనిగంటలు, పని భద్రత, మెరుగైన జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత వంటి అంశాలపై చర్చించి, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై పోరాటాలకు కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ముందుకొచ్చి మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ మండల కార్యదర్శి కనకటి కళింగరాజు, నాయకులు మచ్చ ఎల్లయ్య, గాదపాక రాములు, గుంజే సదయ్య, మామిండ్ల సోమయ్య, శంకటబోయిన తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

