* ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి పంపకాలు పూర్తి!
* మరో పార్టీ వెయ్యి రూపాయలే
* జూబ్లీహిల్స్ లో నోట్లతో ఓట్ల వేట
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. నేటితో ప్రచార పర్వం ముగియనుంది. అంతకు ముందు నుంచే ప్రధాన పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్కు సిద్ధమయ్యారు. ఓట్ల కోసం నోట్ల పంపకాలు మొదలుపెట్టేశారు. ఎన్నిక ఏదైనా పోలింగ్ సమీపించే సరికి పంపకాలు సాధారణమే అయిన అందరికీ తెలిసిందే. ఎన్నికల సంఘం ఎంతలా నిఘా పెట్టినా, పోలీసులు పక్కాగా తనిఖీలు చేపట్టినా డబ్బులు చేతులు మారుతూనే ఉంటాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పర్వం మొదలైంది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈక్రమంలో ఆకేరు న్యూస్ నియోజకవర్గ పరిశీలనలో సంచలన విషయాలు తెలిశాయి.
నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ను ఆనుకుని ఉన్న కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, సనత్నగర్ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతలు రహస్య సమావేశాలు నిర్వహించినట్లు ప్రచారంలో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కీలక వ్యక్తులను, ఓట్లను రాబట్టే వారిని మచ్చిక చేసుకునేందుకు వారితో పక్క నియోజకవర్గాల్లో మాట్లాడుకునేవారు. అపార్ట్మెంట్, కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులు, ఇతర ముఖ్యులను పిలిపించుకొని బేరసారాలు సాగిస్తున్నట్లు ఒక పార్టీ, మరొక పార్టీ ఆరోపణలు చేసుకున్నారు. సమస్యల పరిష్కారంపై పోటాపోటీగా హామీలిచ్చాయి.ఇప్పటి వరకు కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్ మెంట్ అసోషియేషన్లు, బస్తీ లీడర్లతో బేరసారాలు సాగించిన ప్రధాన పార్టీ నాయకులు ఇప్పుడు నేరుగా నియోజకవర్గంలోనే పంపకాలు మొదలుపెట్టారు.
ఇప్పుడు తాజాగా నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పనులు మొదలుపెట్టారు. జూబ్లీహిల్స్ లో నెగ్గేందుకు పోటాపోటీగా.. హోరాహోరీగా.. పోరాడుతున్న రెండు ప్రధాన పార్టీలూ ఓట్ల కోసం నోట్ల పంపకాలు మొదలుపెట్టాయి. అందులో ఓ కీలక పార్టీ అభ్యర్థి ఇక్కడ ఎలాగైనా గెలవాలని, మరో సీటు పార్టీ ఖాతాలో వేయాలని నోట్ల పంపకాలు మొదలుపెట్టాడు. నియోజకవర్గంలో దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. అందులో పార్టీని, ఆ పార్టీ అభ్యర్థిని చూసి ఓ లక్ష ఓట్ల వరకు గ్యారెంటీగా వస్తాయనే అంచనాకు వచ్చారు. ఆ పార్టీ హామీలు, అభ్యర్థి గెలుపు కోసం పార్టీ నేతలు కష్టపడిన తీరును పరిశీలించి గెలుపు అవకాశాలు తమకే ఉన్నాయని భావిస్తున్నారు. అయినప్పటికీ.. గెలపు గ్యారెంటీ కావాలని ఓటుకో రేటు ఫిక్స్ చేశారు. రూ.2,500 పక్కాగా ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఏకంగా లక్ష మందికి ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. దాదాపు ఇప్పటికే పంపకాలు పూర్తయ్యాయి. అందుకు సంబంధించిన వీడియోలూ ఉన్నాయి. మరో పార్టీ ఓటుకు వెయ్యి చొప్పున పంచుతున్నట్లు తెలిసింది.
………………………………………………….
