
* కొన్ని ప్రాంతాల్లో దంచికొడుతున్న వాన
* కరీంనగర్లో రోడ్లు జలమయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని పేర్కొంది. రుతుపవన ప్రభావంతో మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ (Warangal) జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కరీంనగర్(Karimnagar)లో ఉదయం నుంచి భారీ వర్షం మొదలైంది. రహదారులు జలమయం అయ్యాయి. భద్రాచలంలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 27.8 అడుగులకు చేరింది. మరోవైపు రాజధాని జీహెచ్ ఎంసీ పరిధిలో ఉదయం నుంచీ ఆకాశం మేఘావృతమై ఉంది. పలుచోట్ల చిరుజల్లులు మొదలయ్యాయి.
…………………………………………