
* రేపు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు
* గులాబీ మయమైన ఎల్కతుర్తి ప్రాంతం
* ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి
ఆకేరున్యూస్, వరంగల్: పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఆదివారం ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ నిర్వహిస్తోంది. శాసనసభ ఎన్నికలలో ఓటమి తర్వాత నైరాష్యంలో వున్న పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సాహం నింపేందుకు మొదటి నుండి అండగా నిలబడుతున్న ఉద్యమాల ఖిల్లా వరంగల్ లో భారీ సభ ద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టు నిలుపుకునే క్రమంలో ఈ సభ ఎంతో కొంత మేలు చేస్తుందనే భావనతో ఇక్కడ సభ నిర్వహించడం జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్వహిస్తున్న ఈ సభ తెలంగాణలో భారీ రాజకీయ వేడుకగా నిర్వహించడంతో పాటు మళ్లీ ప్రజల మధ్యలో బలమైన స్థానం ఏర్పరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో జనాలను తరలించి నియోజకవర్గాల్లో పట్టు నిరూపించుకునేందుకు మాజీలు చమతోడుస్తున్నారు. రజత్సోతవ సభ నేపథ్యంలో గులాబీ పూర్వ వైభవం కోసం తహతహలాడుతోంది. ఇందులో భాగంగా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యమ గడ్డ ఓరుగల్లు వేదికగా కనీవినీ ఎరుగని రీతిలోజనసమీకరణ చేసి తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. మూడు జిల్లాల సరిహద్దు అయిన ఎల్కతుర్తి వద్ద రజతోత్సవ మహాసభకు సుమారు పది లక్షల మంది కార్యకర్తలు వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే జనాలకు ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్లాన్ ప్రకారం .. ఏర్పాట్లు చేశారు.ఉద్యమ కాలంలో ఓరుగల్లులో పోరుగర్జన, సింహ గర్జనలాంటి సభలను లక్షలాది మందితో సక్సెస్ చేసిన చరిత్ర వున్న బీఆర్ఎస్ ఇప్పుడు అంతకు మించిజనాలను తరలించి గులాబీ సత్తా చాటేందుకు గులాబీ సైన్యం శాయశక్తుల శ్రమిస్తోంది.
సభ కోసం 1213 ఎకరాలు…
రజత్సోవ సభను 1213 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. అందులో 15 ఎకరాల్లో సభా ప్రాంగణం. 5 ఎకరాల విస్తీర్ణంలో సభా వేదిక ఉంటుంది. ఐదు వందల మంది కూర్చునేలా బాహుబలి వేదికను సిద్ధం చేశారు. సభకు వెనుకాలే 4 ఎకరాలు వీఐపీ పార్కింగ్‌కు కేటాయిం చారు. ఇక 150 ఎకరాల్లో పబ్లిక్, వీఐపీ, ప్రెస్ సహా ఉద్యమకారులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలాన్ని భోజన వసతి, పార్కింగ్ కోసం కేటాయించారు. ఎటువైపు నుంచి వచ్చే వాహనాలు అటువైపే పార్క్ చేసేలా.. ఐదు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ ప్యాకెట్లకు పైగా సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
………………………………………………….