* వరంగల్ ఎంపీ కడియం కావ్య
ఆకేరు న్యూస్, వరంగల్ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ హఠాన్మరణం పట్ల వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటంలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందెశ్రీ తెలంగాణ కోసం చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ ఆత్మను పదాలలో బంధించి ప్రజల హృదయాల్లో నింపిన మహాకవి అందెశ్రీ గారు ఆయనతో నాకు, మా కుటుంబానికి ఉన్న అనుబంధం ఎన్నటికీ మరువలేనిది అని డా. కడియం కావ్య పేర్కొన్నారు.ప్రజా కవిగా అందెశ్రీ ప్రజాకళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివని, వారు లేని లోటు పూడ్చలేనిదని, ప్రజా కళాకారులకు కవులకు మరణం ఉండదనీ, ప్రజాకళలు వర్ధిల్లినంతకాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ఎంపీ డా.కడియం కావ్య తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతున్ని ప్రార్థించారు.
………………………………………..
