అనితా చౌదరి
* అమెరికా విమాన టికెట్ల బుకింగ్ పేరుతో మోసం
* నకిలీ ట్రావెల్ ఏజెన్సీని నమ్మి ఓటీపీలు చెప్పిన నటి
* టికెట్లు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాకుండా ప్రముఖులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ నటి అనితా చౌదరి (Anita Chowdary) సైబర్ మోసానికి గురయ్యారు. అమెరికా ప్రయాణానికి విమాన టికెట్లు (Flight Tickets) బుక్ చేసుకునే ప్రయత్నంలో ఉండగా, నకిలీ ట్రావెల్ ఏజెన్సీ (Fake Travel Agency) పేరుతో ఆమెను మోసం చేశారు. టికెట్ల బుకింగ్ పేరుతో ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.4,14,180 కాజేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు (Cyber Crime Police) ఫిర్యాదు చేశారు.
ఆన్లైన్లో ట్రావెల్ ఏజెన్సీ కోసం వెతుకుతుండగా..
హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివసించే అనితా చౌదరి.. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో (Washington DC) ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ (Business Class) రానుపోను విమాన టికెట్ల కోసం ఆన్లైన్లో (Online) వెతికారు. ఈ క్రమంలో ‘లో ఫ్లై ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్’ పేరుతో ఉన్న సంస్థ వివరాలు కనిపించాయి. అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు సంప్రదించగా రాజేశ్ అనే వ్యక్తి మాట్లాడాడు. వాషింగ్టన్ డీసీకి రానుపోను బిజినెస్ క్లాస్ టికెట్ల ధర రూ.4,14,180 అవుతుందని చెప్పాడు.
ఓటీపీలు చెప్పగానే ఖాతా ఖాళీ..
టికెట్ల బుకింగ్ (Ticket Booking) ప్రక్రియలో భాగంగా సదరు వ్యక్తి అనితకు ఓ ఫారం పంపించాడు. అందులో డెబిట్ కార్డు (Debit Card) వివరాలు నమోదు చేయాలని సూచించాడు. అనంతరం ఫోన్లో మాట్లాడుతూ ఆమె మొబైల్‌కు వచ్చిన ఓటీపీలను (OTP) అడిగాడు. టికెట్ల బుకింగ్ కోసమేనని భావించిన అనిత ఆ వివరాలను వెల్లడించారు. కొద్దిసేపటికే ఆమె బ్యాంకు ఖాతా నుంచి క్లియర్‌ట్రిప్ (Cleartrip) ద్వారా రూ.4,14,180 డెబిట్ అయినట్లు సందేశం వచ్చింది. అయితే డబ్బులు కట్ అయినప్పటికీ టికెట్ల బుకింగ్ కన్ఫర్మేషన్ (Booking Confirmation) రాకపోవడంతో ఆమెకు అనుమానం కలిగింది. తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటనపై అనితా చౌదరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. రాజేశ్ పేరుతో మాట్లాడిన వ్యక్తి వివరాలు, ట్రావెల్ ఏజెన్సీ పేరుతో సాగించిన కార్యకలాపాలు, డబ్బులు ఏ ఖాతాలకు బదిలీ అయ్యాయనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ప్రయాణికులకు పోలీసుల సూచనలు
ఆన్లైన్లో విమాన టికెట్లు లేదా ఇతర సేవలను బుక్ చేసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గుర్తింపు లేని ట్రావెల్ ఏజెన్సీలను నమ్మి బ్యాంకు వివరాలు, కార్డు సమాచారం, ఓటీపీలు (One Time Password) వెల్లడించకూడదని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే బ్యాంకును సంప్రదించడంతో పాటు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
Also Read: ‘వ్యూ’తో సరికొత్త కథా ప్రపంచం..

Please tell us what is wrong. Your report will be sent to the website team.

