
* మారణహోమాన్ని ఆపాలి : బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అడవుల్లో మరో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. బీజాపూర్ జిల్లాలోని పిడియా అటవీ ప్రాంతంలో (Pidia forest) గురువారం ఉదయం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఛత్తీస్గఢ్లో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడు నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల కాల్పుల్లో డీఆర్జీ జవాన్తోపాటు మరో సభ్యుడు మృతిచెందగా.. మరికొందరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్ తాజాగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. కాగా, ఆపరేషన్ కగార్ (Operation Kagar) పేరుతో జరుపుతున్న మారణహోమాన్ని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (BKMU) జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు తీవ్రంగా ఖండించారు. ఈ మారణహోమాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కోరారు. హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్కౌంటర్ పేరుతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో సహా 27 మందిని కాల్చి చంపడం దుర్మార్గమన్నారు. కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో ఎంటెక్ చదువుతున్న రోజుల్లో విప్లవ సిద్ధాంతాల వైపు ఆకర్షితుడై అజ్ఞాతం లోకివెళ్లారని, సుదీర్ఘకాలం పాటు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశాడన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించినా మారణహోమం సరికాదన్నారు.
…………………………………………………..