* యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం
* మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రం దిశగా అడుగులు
* 2025 మార్చినాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి
* 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తికి సన్నద్ధం
* సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ సిగలో మరో మణిహారం చేరింది. విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలువనుంది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో దేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అవతరించింది. దేశ విద్యుత్ రంగానికి దేశానికి కలికితురాయిగా నిలిచిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్రానికి ఆశాదీపమైంది. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసి మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు యూనిట్లకు జూన్ 26, 2017న కేంద్ర పర్యావరణ శాఖ అనుమతినిచ్చింది. అదే ఏడాది అక్టోబరు 17న రూ.29 వేల కోట్ల అంచనా వ్యయంతో జెన్ కో నిర్మాణం ప్రారంభించి.. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఇఎల్)కు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది.
అనుకున్న గడువుకన్నా రెండేళ్లు అదనం..
పవర్ ప్లాంట్ నిర్మాణం అనుకున్న గడువుకన్నా రెండేళ్లు అదనం కావడంతో అంచనా వ్యయం రూ.29,500 కోట్ల నుంచి రూ.34,500 కోట్లకు పెరిగింది. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగాయి. ఒకవైపు పనులు ఊపందుకుంటున్న సమయంలోనే ప్లాంట్ నిర్మాణంలో ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఈ ప్లాంట్ లో 50 శాతం దేశీయ బొగ్గును, 50 శాతం విదేశీ బొగ్గును వినియోగించాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా నూటికి నూరు శాతం దేశీయ బొగ్గును వినియోగించనుందని రెండు స్వచ్ఛంద సంస్థలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కి ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్జీటి యాదాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ నిర్మాణానికి పర్యావరణ అనుమతులను నిలిపివేసింది. మరోవైపు కరోనా మహమ్మారితో 10వేల మంది కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లిపోవడంతో రెండేళ్ల పాటు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిరది. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎన్జీటీ క్లియరెన్స్‌ను తీసుకోవడంతోపాటు, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యుత్ ఉత్పత్తికి ఏటా అవసరమయ్యే 3.5 టీఎంసీల నీటిని టెయిల్ పాండ్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 22 కిలోమీటర్ల పైపు లైన్ తో చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. బొగ్గు రవాణా కోసం సమీపంలో జాన్‌పహాడ్ రైల్వే క్రాసింగ్ నుంచి ప్లాంట్ వరకు రూ.100 కోట్ల వ్యయంతో 8కి.మీ రైల్వేలైన్ నిర్మించారు. ప్రతిరోజు ప్లాంట్‌కు అవసరమయ్యే 50 వేల టన్నుల బొగ్గును రామగుండం నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ కు తరలిస్తున్నారు. దక్షిణాదిలో ప్రభుత్వ రంగంలో అతిపెద్దదైన యాదాద్రి పవర్ ప్లాంట్.. మొదటి, రెండో యూనిట్ల నుంచి పూర్తి స్థాయిలో కాంతులు విరజిమ్మనుంది. ప్లాంట్ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సందర్శించి అధికారులతో ఎప్పటికప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షిస్తున్నారు. దశలవారీగా విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు మార్గం సుగమమైంది. హైటెన్షన్ విద్యుత్‌లైన్ టవర్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరులోగా మూడు యూనిట్లలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో అధికారులు పనులను యుద్ధ ప్రాతిపదికన పురోగతి సాధిస్తున్నారు. అందులో భాగంగానే మొదటి, రెండవ యూనిట్లలోని యాక్సిలరీ బాయిలరల్లో లైట్ అప్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ఇంధనాన్ని ఉపయోగించి అధికారులు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. 275 మీటర్ల ఎత్తు గల చిమ్నీ ద్వారా వాయువును విడుదల చేస్తూ ట్రయల్ రన్ లో భాగంగా ప్రాథమిక పరీక్షలను పూర్తి చేశారు. ప్లాంట్ నిర్మాణ పనులు 90 శాతం పూర్తి కావడంతో విద్యుత్ కాంతలు పంచేందుకు పవర్ ప్లాంట్ సిద్ధమైంది.
1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి..
ప్లాంటుకు అనుసంధానంగా రైల్వేలైన్లు పూర్తికావడంతో ప్లాంట్ ద్వారా తెలంగాణకు 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) రూ.928.52 కోట్ల అంచనాతో ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిపను నిర్మించనుంది. మొత్తం 3,52,771.02 చ.మీ.ల విస్తీర్ణంలో ఈ టౌన్షిప్ నిర్మాణం జరగనుండగా, 2,21,903.67 చ.మీ.ల విస్తీర్ణంలో నివాస గృహ సముదాయాలతో టౌన్ షిప్ ను నిర్మించనున్నారు. పవర్ ప్లాంట్ పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే 2025 మార్చి నాటికి వేల సంఖ్యలో ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు, ఇతర కార్మికులు ఇక్కడ రాత్రింబవళ్లు పనిచేయనున్నారు. వీరంతా తప్పనిసరిగా స్థానికంగా నివాసం ఉండాల్సి రావడంతో టౌన్షిపను జెన్కో నిర్మిస్తోంది. 11 అంతస్తుల బహుళ అంతస్తుల సముదాయాల్లో ఈ క్వార్టర్లు ఉండనున్నాయి. మరోవైపు కేసీఆర్ కలల ప్రాజెక్టు.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్రానికి ఆశాదీపం కానుంది. వివిధ రాష్ట్రాలు, సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు ముగియనున్న నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఆశాదీపం కానున్నది. రాష్ట్ర విద్యుత్తు అవసరాల కోసం ఇతర రాష్ట్రాల పవర్ ప్లాంట్లతో చేసుకున్న కీలక ఒప్పందాల గడువు రెండు, మూడేండ్లలోనే ముగియనుంది. 2024- 25లో 2,284 మెగావాట్లు, 2025 -26లో 2,400 మోగావాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు ముగుస్తాయి. వీటితో పాటు మరో 2,899 మెగావాట్ల సోలార్ విద్యుత్తు వినియోగ ఒప్పందాలు సైతం ముగియనున్నాయి. రామగుండం యూనిట్ -7కు చెందిన 87.76 మెగావాట్ల ఒప్పందం 2026 -27లో ముగియనుంది. 2028-29లో 583.9 మెగావాట్ల సింహాద్రి ఒకటో దశ ఒప్పందం ముగియనుండగా, అదే ఏడాదిలో వెయ్యి మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ ఒప్పందం గడు వు సైతం 2028-29లో ముగియనుంది. ఈ నేపథ్యంలో యాదాద్రి పవర్ ప్లాంట్ రాష్ట్రాన్ని విద్యుత్తు కష్టాల నుంచి బయట పడేయనుంది. ప్లాంట్ లోని 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రెండవ యూనిట్ ను సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ గ్రిడ్ కు అనుసంధానం చేసి ప్లాంటును జాతికి అంకితం చేశారు. ఈ నెలాఖరు నాటికి మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మిగతా రెండు యూనిట్లను మార్చి 2025 నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్రానికి వెలుగులు విరజిమ్మేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారు.
………………………………………