* నగరానికి కు మరోసారి యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్
* వాళ్లు వచ్చి వెళ్లిన వెంటనే తనిఖీలు ముమ్మరం చేసిన సిటీ పోలీస్
* ఢిల్లీ పేలుళ్ల దర్యాప్తులో కీలక విషయాలు
* హైదరాబాద్‌లోనూ అనువణువూ పరిశీలన..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
గుజరాత్ కు చెందిన యాంటీ టెర్రరిస్టు స్వ్కాడ్ మరోసారి హైదరాబాద్ కు చేరుకుంది. రాజేంద్రనగర్‌లోని డాక్టర్ సయ్యద్ మోహియుద్దీన్ ఇంట్లో సోదాలు జరిపింది. కంప్యూటర్, హార్డ్ డిస్క్, కొన్ని రసాయనాలను సైతం స్వాధీనం చేసుకుంది. అతడి గదిని దాదాపు 3 గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించింది. మోహియుద్దీన్ గదికి తాళం వేయాలని, ఎవరూ వెళ్లేందుకు వీలు లేదని అతడి కుటుంబ సభ్యులను హెచ్చరించింది. రోజుల వ్యవధిలోనే యాంటీ టెర్రరిస్టు టీం నగరానికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో వారు వచ్చిన రెండు రోజుల్లోనే ఢిల్లీ కారు బ్లాస్ట్ జరిగింది. ఆ టీం అరెస్టు చేసిన ముగ్గురు ఉగ్రవాదుల్లో నగరానికి చెందిన మోహియుద్దీన్ ఉండడంతో హైదరాబాద్ కు వచ్చి అతడి ఇంట్లో సోదాలు జరిపారు. అనంతరం జరిగిన ఢిల్లీ పేలుళ్లతో దేశమంతా కలకలం రేగింది.
దర్యాప్తులో షాకింగ్ అంశాలు
ఆ కేసు దర్యాప్తు అనంతరం వెలుగుచూస్తున్న అంశాలు షాకింగ్ కు గురిచేసేలా ఉన్నాయి. ఉగ్రవాదుల టార్గెట్ లో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్ మాత్రమే కాదు. కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి ప్రముఖ కట్టడాలు కూడా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అంతేకాదు.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కుట్రకు ప్లాన్ చేశారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మోహియుద్దీన్ ఉంటున్న హైదరాబాద్ లో అందుకు అవకాశాలు ఉన్నాయనే కోణంలోనూ పోలీసులు మరోసారి తనిఖీలు చేపట్టారనే ప్రచారం జరుగుతోంది. వైద్యుల టెర్రర్ మాడ్యూల్‌గా పిలుస్తున్న ఈ గ్రూప్ దేశవ్యాప్తంగా విధ్వంసకర దాడులకు సిద్ధమవుతోందని అధికార వర్గాలు కూడా ఇప్పటికే ప్రకటించాయి. డిసెంబరు 6న ఈ గ్రూపు కేవలం రాజధానికే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వరుస దాడులకు సిద్ధమవుతోందని సమాచారం మేరకు నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.
సిటీ పోలీస్ అలర్ట్..
హైదరాబాద్ కు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ వచ్చి మరోసారి రాజేంద్రనగర్‌లో తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో నగర పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ ఆదేశాలతో డిల్లీతో పాటు.. ముంబై, బెంగళూరు, కోల్‌కతాతో పాటు హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈక్రమంలోనే మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ పరిధిలోనూ పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందిని అనుక్షణం అలర్ట్ చేస్తున్నారు. దీంతో లా అండ్ ఆర్డర్‌తో పాటు.. ఆర్పీఎఫ్ పోలీసులు డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో వాహనాలను ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నాయి. అనుమానితులను, అనుమానిత బ్యాగులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారిని గుర్తించి ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు.
