
* ఇందిరమ్మ ఇండ్ల కోసం ధర్నా
ఆకేరు న్యూస్, జనగామః ఇండ్లు, భూములు, జాగలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం ఏమిటనీ పలువురు మహిళలు, యువకులు బీ ఆర్ ఎస్ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ ధర్నా కార్యక్రమానికి మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్ లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి, నవీన్ కుమార్ మాట్లాడుతూ గత బీ ఆర్ ఎస్ పాలనలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఆనాడు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు మంజూరు అయ్యేవన్నారు. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల కుటుంబాలకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎంపికలో పక్షపాతం, బంధుప్రీతి, ఆర్ధికంగా బాగా ఉన్నవారికి, గతంలో ఇందిరమ్మ ఇండ్లు తీసుకుని బిల్లులు పొందిన వారికి ఇండ్లు మంజూరు చేశారని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయకుండా అధికారులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కు అయ్యారని ఆవేధన వ్యక్తం చేశారు. ముత్తారంలో ఎంపిక చేసిన 23 మంది లబ్ధిదారులలో 20 మంది అనర్హులు ఉన్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి విచారణ జరిపించాలని, అర్హులైన వారికే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు అన్యాయం జరిగితే జరిగే నిరసనకు బిఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి మద్దతు ఉంటుందన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆటు పిమ్మట తహాసీల్థార్ కార్యాలయంకు వెళ్ళి లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు ఇండ్ల మంజూరు చేశారని, నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని డిమాండ్ చేస్తూ తహసీల్ధార్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముత్తారం ప్రజలతో పాటుగా, బీ ఆర్ ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పాము శ్రీనివాస్, సొసైటీ వైస్‌చైర్మన్ కారుపోతుల వేణు, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, గాదేపాక శ్రీనివాస్, కడుదుల కరుణాకర్‌రెడ్డి, వేణురావు, లాకావత్ వెంకట్‌నాయక్, కారుపోతుల వెంకటయ్య, వెన్నమనేని మురళీధర్ రావు, తదితర బిఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు.
………………………………………………..