
* ట్రంప్ వ్యాఖ్యలతో ఆందోళనలో భారతీయులు
* దిగ్గజ కంపెనీలు అధ్యక్షుడి ఆదేశాలు పాటిస్తే..
* మన వాళ్ల భవిష్యత్తు ఆగమ్య గోచరమే..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచీ భారతీయ టెకీలకు, విద్యార్థులకు కష్టకాలం మొదలైంది. ట్రంప్ దేశభక్తి.. భారతీయులకు శాపంగా మారుతోంది. తాను అనుకున్నది అమలు చేసేందుకు తన విజయంలో కీలక పాత్ర పోషించిన పారిశ్రామిక దిగ్గజం ఎలాన్ మస్కనే లెక్క చేయని ట్రంప్.. ఇప్పుడు భారతీయులపై విధిస్తున్న ఆంక్షల అమల్లో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా బుధవారం వాషింగ్టన్ లో జరిగిన ఏఐ సదస్సుల్లో ట్రంప్ వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి. *భారతీయులకు ఉద్యోగాలు ఆపండి..
భారతీయులకు ఉద్యోగాలు ఆపండి .వారి స్థానంలో అమెరికన్లను ప్రోత్సహించండి.. అని అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలను ట్రంప్ ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది.
“అమెరికా ఫస్ట్” అంటూ…
ఇప్పటి వరకు అమెరికాలో టెక్నాలజీ కంపెనీలు, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలో భారతీయ టెకీలకు అవకాశాలు అధికంగా ఉండేవి. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ “అమెరికా ఫస్ట్” విధానాన్ని మొదలు పెట్టిన నాటి నుంచీ అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. దీని కారణంగా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగాలను అమెరికన్లకే ప్రాధాన్యతనిస్తూ, భారతీయ ఉద్యోగుల నియామకాన్ని తగ్గించాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. దీనివల్ల ఐటీ రంగంలో ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, అమెరికా ఆర్థిక వ్యవస్థలో మార్పులు, కంపెనీల పునర్వ్యవస్థీకరణ వంటివి ఉద్యోగాల కోతలకు దోహదం చేస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులలో చాలామంది హెచ్-1బీ వీసా పైనే ఆధారపడి ఉన్నారు. ఈ వీసా నిబంధనలు కఠినతరం అయితే, ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
అధ్యక్షుడి ఆదేశాలు పాటించడం అనివార్యమా?
అమెరికాలో భారతీయుల స్థానం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, అమెరికాలో స్థిరపడిన భారతీయులు, భారతీయ అమెరికన్లు సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నారు. అయితే, అమెరికా ప్రభుత్వ విధానాలు, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు భవిష్యత్తులో భారతీయుల అమెరికా వలసపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు.. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. “చైనాలో మీ ఫ్యాక్టరీలు.. భారతీయులకు మీ ఉద్యోగాలు.. ఇక్కడ అమెరికన్లకు మాత్రం మొండిచెయ్యి.. ఇక ఆ రోజులు ముగిశాయి,” అంటూ అగ్రరాజ్య టెక్ కంపెనీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని మరోసారి గట్టిగా వినిపిస్తూ, భారతీయ ఉద్యోగులను నియమించుకోవడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
రాడికల్ గ్లోబలిజం అంటూ హెచ్చరికలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సదస్సులో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్, అమెరికా టెక్ కంపెనీల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధస్సుకు సంబంధించి మూడు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. అమెరికా టెక్ పరిశ్రమ “రాడికల్ గ్లోబలిజం” (తీవ్ర ప్రపంచీకరణ)ను అనుసరిస్తోందని, ఇది లక్షలాది మంది అమెరికన్లకు చేసిన ద్రోహంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. “మన అతిపెద్ద టెక్ కంపెనీలు చాలా వరకు చైనాలో ఫ్యాక్టరీలు కడుతున్నాయి. కానీ, భారతీయులను ఉద్యోగులుగా పెట్టుకుంటున్నాయి, ఐర్లాండ్లో పన్నులు కట్టి లాభాలు గడిస్తున్నాయి. ఇవన్నీ మీకు తెలుసు. కానీ, అదే సమయంలో ఇక్కడ తమ సొంత పౌరులను, అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. అందుకే చెబుతున్నా.. అధ్యక్షుడు ట్రంప్ పాలనలో ఆ రోజులు పోయాయి,” అని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. “మీరు అమెరికాను మొదటి స్థానంలో నిలపాలి. మేము అడుగుతున్నది అదే,” అంటూ టెక్ కంపెనీలకు ఆయన స్పష్టమైన సందేశం పంపారు.
డోనాల్డ్ ట్రంప్ కీలక ఉత్తర్వులు
అమెరికా AI పరిశ్రమకు మద్దతు ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో సమన్వయ ప్రణాళిక, అమెరికాలో తయారైన AI టెక్నాలజీ ప్యాకేజీల ఎగుమతిని ప్రోత్సహించడం, విదేశాల్లో పెట్టుబడులు పెట్టే అమెరికన్ కంపెనీలపై ఆంక్షలకు సంబంధించి ట్రంప్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని తాను ఎంత కఠినంగా అమలు చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల భారతీయ టెకీల స్థానంలో అక్కడి కంపెనీలు అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వక తప్పేల కనిపించడం లేదు. అదే జరిగితే అమెరికాలో భారతీయులకు ఉద్యోగావకాశాలు తగ్గవచ్చు. అలాగే భారత్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు అమెరికాలో వ్యాపార లావాదేవీలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే ఆ ప్రభావం వాటి ఉద్యోగులపై పడే అవకాశం ఉంటుంది.
…………………………………………….