
* ఉప ఎన్నికలపై విపక్షాల అమితాసక్తి
* రావడం ఖాయమనే ధీమాలో బీఆర్ ఎస్, బీజేపీ
* విపక్షాలకు అంత నమ్మకం ఏంటి? అసలు చట్టంలో ఏముంది?
* ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్న కేసీఆర్ మాటల్లో నిజమెంత?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ .. అంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. మొదట్లో బీఆర్ ఎస్ నుంచి ఒక్కో ఎమ్మెల్యే చేరుతుండడంతో పార్టీలో ఉత్సాహం పెరిగింది. తమ బలం పెరుగుతోందని ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగ మురిసిపోయారు. కీలకమైన నేతలు సైతం.. హస్తం గూటికి చేరడం సంచలనంగా మారింది. దీంతో బీఆర్ ఎస్ పని అయిపోయిందన్న ప్రచారం జరిగింది. ప్రచారానికి తగినట్లుగానే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటూ రాకపోవడంతో ప్రధాన ప్రతిపక్షం డీలా పడింది. కొన్నాళ్లకే కుదుట పడింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పోరాటం మొదలుపెట్టింది.
వరుస పిటిషన్లు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని న్యాయస్థానాల్లో బీఆర్ ఎస్ వరుస పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో పాటు వివేకానంద గౌడ దాఖలు చేసిన రెండు పిటిషన్లతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి, వివేకా కలిసి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై పిటిషన్ వేయగా.. మరో ఏడుగురి పేర్లను జత చేసి కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లను జత చేసి ఈనెల 10న సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కూడా కేసు విచారణకు హాజరయ్యారు. విచారణ సమయంలో రీజినబుల్ టైం అంటే ఏంటి.. పది నెలలు రీజనబుల్ టైం కాదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి దాదాపు 10 నెలలు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని… వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ముందు బీఆర్ఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
నోటీసులు పంపిన శాసనసభ కార్యదర్శి
కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు నోటీసులు పంపారు. బీఆర్ ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా ఈ నోటీసులు ఉన్నాయి. 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దానం నాగేందర్(Danam Nagendar), కడియం శ్రీహరి(Kadiyam Srihari), కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ(Arekapudi Gandhi) కాంగ్రెస్ లో చేరారు. ఈ కేసు విచారణ ఇంకా న్యాయస్థానంలో కొనసాగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమని బీఆర్ఎస్, బీజేపీ చాలా నమ్మకంగా ఉన్నాయి.
ఉప ఎన్నికలు ఖాయం..
ఆ పది స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, క్యాడర్ సిద్ధంగా ఉండాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పలు సందర్భాల్లో అంటూనే ఉన్నారు. ఉప ఎన్నికలొస్తే.. గెలుపు తమదేనని అంటున్నారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ నోటీసులిచ్చారు. తాజాగా బీఆర్ ఎస్ భవన్లో జరిగిన సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ కూడా.. రాష్ట్రంలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమన్న గులాబి బాస్, ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు తీర్పు రాబోతోందని ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఈ అంశం గురించి ఇప్పటికే లాయర్లతో మాట్లాడినట్లు తెలిపారు.
ఏడు సీట్లు బీజేపీకే : బండి సంజయ్
మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీకి కూడా.. ఉప ఎన్నికలు ఖాయమనే చెబుతోంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో ఉప ఎన్నికలు ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల జోష్యం చెప్పారు. అంతే కాదు.. ఆ పదిలో 7 సీట్లు బీజేపీ గెలవడం ఖాయమన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉప ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలు వస్తే, సిద్ధంగా ఉండేలా ఆయా నియోజవర్గాలపై దృష్టి కూడా పెడుతున్నట్లు పేర్కొంటున్నారు. అటు బీఆర్ ఎస్.. ఇటు బీజేపీ రెండూ ఉప ఎన్నికలు కచ్చితంగానే వస్తాయనే పేర్కొంటున్నాయి.
వారికి ఎందుకంత ధీమా.. చట్టంలో ఏముంది?
ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలోకి దూకి ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ, ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో, కాంగ్రెస్ (రాజీవ్‌గాంధీ ప్రభుత్వ) హయాంలోనే 1985లో ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని’ తీసుకొచ్చారు. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పదో షెడ్యూల్‌ను చేర్చింది. ఆర్టికల్స్ 101, 102, 190, 191ల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి వివరించారు. ఈ చట్టం ప్రకారం.. ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచిన సభ్యుడు ఆ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే, ఆ వ్యక్తిని అనర్హుడిగా పరిగణించాలి. ఇండిపెండెంట్‌గా గెలిచి చట్టసభకు ఎన్నికైన సభ్యుడు తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలోకి మారితే ఆ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలి. సొంత పార్టీ జారీచేసిన ఆదేశాలకు (విప్) విరుద్ధంగా సభ్యుడు ఓటేసినా లేదా ఆ సమయంలో సభకు హాజరుకాకపోయినా సదరు సభ్యుడిని అనర్హుడిగా పరిగణించాలి. సభకు నామినేట్ అయిన సభ్యుడు నామినేట్ అయిన తేదీ నుంచి ఆరు మాసాల తర్వాత మరేదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు అనర్హతవేటు పడుతుంది. ఒక పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో 2/3 వంతు సభ్యులు వేరొక పార్టీలోకి మారినప్పుడు ఈ చట్టం ప్రభావం ఉండబోదు. ఈమేరకు బీఆర్ ఎస్ హయాంలోనే వారు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్‌లోకి వచ్చిన వారు బీఆర్ ఎస్ మొత్తం సభ్యుల్లో 2/3 వంతు లేకపోవడం.. పార్టీలో చేరిన వారిలో ఉన్న దానం నాగేందర్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయడం వంటి కారణాలతో వారిపై అనర్హత వేటు ఖాయమనే ధీమా విపక్షాల్లో కనిపిస్తోంది.
వ్యూహాత్మకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు
ఇదిలా.. ఉండగా అసెంబ్లీ కార్యదర్శి నోటీసులపై స్పందించిన ఆ ఎమ్మెల్యేలు తమకు 40 రోజుల సమయం కావాలని స్పీకకు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ తరఫు లాయర్లకు తోడు సొంతంగా లాయర్లను పెట్టుకున్నారు. బీఅర్ఎస్ హయాంలో ఫిరాయింపులపై అప్పటి స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ విషయం కోర్టులోనే తేల్చుకుంటామంటామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కూడా వీరు హాజరుకాలేదు. అనర్హత వేటు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు ఖాయమైతే ఆ పదిలో కాంగ్రెస్ గెలిచే స్థానాలపై ఉత్కంఠ ఏర్పడింది. పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్న సంకేతాల నేపథ్యంలో కాంగ్రెస్ అప్రమత్తమవుతోంది. సంక్షేమ పథకాల అమలులో దూకుడు పెంచుతోంది.
……………………………………………………