
* మూడో పార్టీ ఎలాన్ మస్క్ దేనా?
* పోటీలో చిన్నపార్టీలకు స్థానం ఉందా.. లేదా..
* అగ్రరాజ్యంలో ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
ది అమెరికా పార్టీ పేరుతో అపరకుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటనతో అగ్రరాజ్యం అమెరికా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు అక్కడ అధ్యక్ష ఎన్నికలు అంటే.. రెండు పార్టీల మధ్యే హోరాహోరీ పోరుగా సాగుతోంది. ఎప్పుడూ ఆ పార్టీల పేర్లే వినిపించేవి. ఇప్పుడు పోటీలో ఉండే మూడో పార్టీగా ది అమెరికా.. తెరపైకి రాబోతోంది. అయితే.. అసలు అమెరికాలో ఇప్పటి వరకు ఉన్నది రెండు పార్టీలేనా? అక్కడ ఇంక వేరే పార్టీలు లేవా..? ఉన్నా పోటీ చేయవా అనే అంశాలపై “ఆకేరు న్యూస్” ఆసక్తికర కథనం..
ప్రధాన పార్టీల ప్రస్థానం..
భారతదేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి. కానీ అమెరికాలో ఎలక్షన్ సిస్టమ్ వేరుగా ఉంటుంది. అక్కడ అమెరికా ఫెడరల్ ప్రభుత్వం తరఫున ఎలక్షన్ కమిషన్ ఉన్నా, అది కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది. మిగిలిన ప్రక్రియ రాష్ట్రాల చేతిలో ఉంటుంది. ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక ఎలక్షన్ రెగ్యులేటరీ ఉంటుంది. బ్యాలట్ పేపర్ డిజైన్ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండదు. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ నాలుగేళ్లు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఇక ప్రధాన పార్టీల్లో మొదటిది డెమోక్రటిక్ పార్టీ. 1828లో ఆండ్రూ జాక్సన్, మార్టిన్ వాన్ బ్యూరెన్ ఆ పార్టీని స్థాపించారు. అమెరికాలోనే కాదు.. ప్రపంచంలోనే ఇది అత్యంత పురాతనమైన పార్టీగా దీనికి పేరుంది. ఈశాన్య , పశ్చిమ తీరం మరియు ప్రధాన అమెరికన్ పట్టణ కేంద్రాలలో డెమొక్రాట్లు బలంగా ఉన్నారు. 2004లో ఇది అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. 72 మిలియన్ల మంది నమోదిత ఓటర్లు ఈ పార్టీకి ఉన్నారు. 2018 నాటికి కూడా డెమొక్రాటిక్ పార్టీ దాదాపు 60 మిలియన్ల నమోదిత సభ్యులతో యునైటెడ్ స్టేట్స్లో అతిపెద్దది.
రిపబ్లికన్ పార్టీ
రిపబ్లికన్ అమెరికాలో రెండో అతిపెద్ద పార్టీ. 1854లో ఉత్తర బానిసత్వ వ్యతిరేక కార్యకర్తలు, ఆధునికవాదులు ఈ పార్టీని స్థాపించారు. 1860లో అబ్రహం లింకన్ ఎన్నికతో ఈ పార్టీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ పార్టీ ప్రస్తుతం మార్కెట్ ఆ ధారితంగా ఉంది. తరచుగా అమెరికన్ వ్యాపార ప్రయోజనాలకు సహాయపడే విధానాలకు అనుకూలంగా ఉంటోంది. డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక తో రిపబ్లికన్ పార్టీ మరింత ప్రజాదరణను పొందింది. ఈ పార్టీ దక్షిణ యునైటెడ్ స్టేట్స్లో , మెట్రోపాలిటన్ ప్రాంతాల వెలుపల, తక్కువ-కేంద్రీకృత, తక్కువ-సాంద్రత గల ప్రాంతాలలో బలంగా ఉంది.
ఆ రెండు పార్టీలే కాదు..
అయితే దశాబ్దాలుగా అమెరికాలో ఎన్నికలను వరుసగా రెండు ప్రధాన రాజకీయ పార్టీలే శాసిస్తున్నాయి. అవి డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ రెండు పార్టీలు, వాటి నుంచి పోటీ చేస్తున్న అధ్యక్ష అభ్యర్థుల పేర్లే వినిపిస్తుంటాయి. లేదా అప్పుడప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లు వినిపిస్తాయి. ఎన్నికల్లో మరిన్ని పార్టీలు కూడా పోటీలో ఉంటున్నాయి. అమెరికన్ రాజకీయాల్లో ఆ రెండు పార్టీలే ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, మరికొన్ని పార్టీలు అప్పుడప్పుడు కనిపించాయి. విజయవంతం కాకపోయినా అధ్యక్ష పదవికి అభ్యర్థిని నిలిపిన పార్టీలు ఉన్నాయి. వాటిలో నో నథింగ్ లేదా అమెరికన్ పార్టీ , పీపుల్స్ పార్టీ (పాపులిస్ట్) అభ్యర్థి జేమ్స్ బి. వీవర్, థియోడర్ రూజ్వెల్ట్ ప్రోగ్రెసివ్ లేదా ” బుల్ మూస్ పార్టీ “, రాబర్ట్ ఎం. లా ఫోలెట్ ప్రోగ్రెసివ్ పార్టీ , స్ట్రోమ్ థర్మోండ్ డిక్సీక్రాట్ స్టేట్స్ రైట్స్ పార్టీ, హెన్రీ ఎ. వాలెస్ ప్రోగ్రెసివ్ పార్టీ, జార్జ్ వాలెస్ అమెరికన్ ఇండిపెండెంట్ పార్టీ , రాస్ పెరోట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
50 రాష్ట్రాలలోనూ స్థానిక పార్టీలు
అమెరికాలో ఉన్న యాభై రాష్ట్రాలలోనూ స్థానిక పార్టీలు ఉన్నాయి, వాటి నిర్మాణాలు, నియమాలు భిన్నంగా ఉంటాయి. ఒక్కో పార్టీ.. ఒక్కో ప్రాంతంలో బలాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో సోషలిస్ట్ పార్టీ, ఫార్మర్-లేబర్ పార్టీ ఆఫ్ మిన్నెసోటా, విస్కాన్సిన్ ప్రోగ్రెసివ్ , కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ న్యూయార్క్ స్టేట్, పాపులిస్ట్ పార్టీలు ప్రముఖమైనవి. అలాగే దేశ, రాష్ట్ర ఎన్నికల్లో కాకుండా కేవలం స్థానిక ఎన్నికలలో కనిపించే పార్టీలో లిబర్టేరియన్, నేచురల్ లా పార్టీ, పీస్ అండ్ ఫ్రీడమ్ ఉన్నాయి.
మూడు రకాలుగా ఓటింగ్ ప్రక్రియ
అమెరికా ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ మూడు రకాలుగా సాగుతుంది. బ్యాలట్ పేపర్లు, బ్యాలట్ మార్కింగ్ డివైస్లు, డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్లో ఓటింగ్ జరుగుతుంది. దేశంలో 70శాతం మంది బ్యాలట్ పేపర్లతోనే ఓటింగ్ వేస్తున్నారు. తమకు నచ్చిన అభ్యర్థి పక్కన మార్కింగ్ చేసి.. బ్యాలట్ బాక్సులో వేస్తారు. ఇది దేశంలో అత్యధిక మంది ఇష్టపడుతున్న ప్రక్రియ. ఇదిలా ఉండగా తాజాగా అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ది అమెరికా పార్టీని ప్రకటించడంతో ఇది కూడా అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
………………………………………………………..