
* కూకట్‌పల్లిలో పొలిటికల్ హీట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ (WARANGAL) బైపాస్ రోడ్డులోని ఎల్కతుర్తిలో ఆదివారం సాయంత్రం జరిగే సభకు లక్షలాది మంది తరలివస్తారన్న అంచనాతో కనీవిని ఎరుగని రీతిలో సభకు బీఆర్ ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. కీలక నేతలంతా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి వరకు పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలను సమాయత్తం చేశారు. దాంతో వేలాది మంది తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ (HYDERABAD) లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహానగరంలో మెజార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్‌కు చెందిన వారే కావడంతో నగరాన్ని గులాబీమయం చేశారు. అయితే, రాత్రికి రాత్రే చాలాచోట్ల వాటిని తొలగించారు. కొన్నిచోట్ల చించేశారు. దీనిపై హైదరాబాద్ రచ్చ జరుగుతోంది.
ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు : మాధవరం
కుత్బుల్లాపూర్ ఎక్స్ రోడ్ షాపూర్ నగర్ ఉషోదయ టవర్స్ సూరారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్ పల్లి కేపీహెచ్బీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను హైడ్రా అధికారులు తొలగించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MADAVARAM KRISHNARAO) వీటిని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల తొలగింపుపై ఆయన ఘాటుగా స్పందించారు. రాత్రికి రాత్రే బిఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఫ్లెక్సీలు నెలల తరబడి ఉన్న అధికారులకు కనిపించవా అని ప్రశ్నించారు. రజతోత్సవాలు సభ జరిగక ముందే ఫ్లెక్సీలు తీసేసారా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కాంగ్రెస్ తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం ఆదికారులు పనిచేయాలి పార్టీల కోసం కాదన్నారు.
………………………………………………….