![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/bb000c49-47ad-4832-8267-7354fd0b2b74-1024x728.jpg)
* రోడ్డు పనుల్లో అవకతవకలు వెలికితీసినందుకే?
* సంబంధిత కాంట్రాక్టర్ ఇంటి ప్రాంగణంలో మృతదేహం
* కాంట్రాక్టర్‌పైనే అనుమానం
* విషాదాంతంగా జర్నలిస్టు ముఖేశ్ చంద్రకార్ మిస్సింగ్
* నిందితులను కఠినంగా శిక్షించాలని జర్నలిస్టు సంఘాల ఆందోళన..
ఆకేరు న్యూస్ డెస్క్ : చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు ముఖేష్ చంద్రకార్ను దారుణంగా చంపేశారు. మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ పడేసి.. కాంక్రీట్ మిక్స్ వేసి మరీ పూడ్చేశారు. న్యూ ఇయర్ రోజునే అతడిని కిడ్నాప్ చేసిన దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. చత్తీస్‌గఢ్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రోడ్డు పనుల్లో జరుగుతున్న అవకతవకలను వెలుగులోకి తెచ్చినందుకే సంబంధిత కాంట్రాక్టర్‌కు చెందినవాళ్లే ఈ హత్య చేసి ఉంటారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ముఖేశ్ చంద్రకార్ ప్రముఖ సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం బస్తర్ జంక్షన్ పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతున్నారు. అతని చానల్ కు 1.59 లక్షల మంది సబ్ స్రైబర్ లు ఉన్నారు.
డిసెంబర్ 30న రోడ్డు పనుల్లో అవినీతిపై కథనం
జర్నలిస్టు ముఖేశ్ న్యూ ఇయర్ రోజు నుంచీ కనిపించడం లేదు. దీంతో ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓ కాంట్రాక్టర్ సురేష్ చంద్రకార్ ఇంటి సమీపంలో జర్నలిస్టు సెల్ ఫోన్ సిగ్నల్ ఆగినట్లు గుర్తించారు. అక్కడి వెళ్లి పరిశీలించగా ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్ లో జర్నలిస్టు మృతదేహాన్ని గుర్తించారు. అతడిని హత్య చేసి ఆనవాళ్లు దొరక్కకుండా కాంక్రీట్ మిక్స్ వేసి మరీ పూడ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అనుమానితులను విచారిస్తున్నట్లు ఐజీ బస్తర్ పేర్కొంటున్నారు. కాగా, మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసుల రాకపోకలకు అనువుగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు కేటాయించింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపడుతున్నారని డిసెంబర్ 30న జర్నలిస్టు ముఖేష్ చంద్రకార్ వార్త ప్రచురించారని, దీనిపై సంబంధిత మంత్రి విచారణకు కమిటీ వేశారని స్థానిక జర్నలిస్టులు చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి జర్నలిస్టు కనిపించడం లేదు. ఈక్రమంలోనే అతడి హత్య జరిగి ఉంటుందని జర్నలిస్టు కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
డేరింగ్ రిపోర్టర్
యువ జర్నలిస్టు ముఖేశ్ చంద్రకార్ గతంలోనూ అనేక పరిశో్ధనాత్మక కథనాలు వెలువరించారు. డేరింగ్ రిపోర్టర్ గా గుర్తింపు పొందారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి కూడా కథనాలు అందించారు. ముఖ్యంగా మహిళా కమాండోలు, మావోయిస్టుల కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్లపై ఆసక్తికర అంశాలు వెల్లడించినట్లు స్థానిక రిపోర్టర్లు చెబుతున్నారు. ఆదివాసీ ప్రజల జీవన స్థితిగతులను కళ్లకు కట్టినట్లు ప్రపంచానికి చూపించారు. ఈక్రమంలోనే రోడ్ల స్కాంపై కూడా ఆయన కథనాలు ప్రసారం చేశారు. అదే ఆయన హత్యకు దారి తీసి ఉంటుందని తెలుస్తోంది. ఆసక్తికర అంశం ఏంటంటే.. ఆ కాంట్రాక్టర్ ముఖేశ్ చంద్రకార్కు సమీప బంధువనే ప్రచారం జరుగుతోంది. హత్యకు కారకులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
నిందితులను కఠినంగా శిక్షిస్తాం : ఛత్తీస్‌గఢ్ సీఎం
నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తెలిపారు. జర్నలిస్టు మృతికి ఆయన సంతాపం తెలిపారు. “బీజాపూర్‌కు చెందిన జర్నలిస్టు ముఖేష్ చంద్రకార్ హత్య వార్త చాలా బాధాకరం, హృదయ విదారకంగా ఉంది. ముఖేష్ జీ మరణం జర్నలిజం ప్రపంచానికి మరియు సమాజానికి తీరని లోటు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. నేరస్తులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశాం” అని ఛత్తీస్‌గఢ్ సీఎం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
…………………………………………