* చొరబడుతున్న నేరగాళ్లు
* అమాయకుల్లా వచ్చి వసతి
* గుర్తింపు పరిశీలించకుండానే గదులు అద్దెకిస్తున్న నిర్వాహకులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆ ముగ్గురూ అంతర్రాష్ట్ర నేరగాళ్లు. కానీ, చూసేందుకు అలా కనిపించరు. మిల్క్‌బాయ్‌లా అమాయకంగా ఉంటారు. ఉపాధి కోసం వచ్చామంటూ ఎస్ఆర్నగర్లోని ఓ హాస్టల్లో దిగారు. ఎంత అద్దెయినా ఇస్తామని, ముగ్గురికీ కలిపి ఒక రూమ్ కావాలని తీసుకున్నారు. చూసేందుకు బానే ఉన్న వారికి నిర్వాహకులు గదిని అద్దెకిచ్చారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే కానీ తెలియలేదు. వారు బెంగళూరు నుంచి వచ్చిన డ్రగ్స్ స్మగ్లర్స్ అని.
హాస్టళ్ల అడ్డాలు
అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి.. ఇలా హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాలు హాస్టళ్లకు అడ్డాలుగా ఉన్నాయి. నిత్యం వేలాది మంది నగరానికి ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వస్తున్న కొందరు హాస్టళ్లలోనే మకాం వేస్తున్నారు. నగరంలో హాస్టళ్ల బిజినెస్ రూ.కోట్లలో జరుగుతుంది. రూ. ఐదు వేల నుంచి 15 వేల వరకు హాస్టల్ గదులు అద్దెకిస్తున్నారు. అత్యవసరంగా వచ్చిన ఎంతో మందికి హాస్టళ్లలో వసతి కాస్త ఉపశమనం కల్పిస్తున్నప్పటికీ, కొందరు నేరగాళ్లు కూడా హాస్టళ్లలోనే తిష్ట వేస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాలు
విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం నగరానికి వస్తున్న వారిలో కొందరు అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడుతూ హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారు. బతుకుదెరువుకోసం వచ్చినట్లు నమ్మించి వసతి గృహాలు, పీజీ హాస్టళ్లలో చేరుతూ కొన్నాళ్లకు అసలు రూపాన్ని ప్రదరిస్తున్నారు. సూరారంలోని ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాయిరాంరెడ్డి (23)ని ఇటీవల రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చి జైల్లో ముంబై క్రిమినల్స్‌తో పరిచయం పెంచుకున్న నిందితుడు గుట్టుగా మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఆయుధాలు దిగుమతి చేసుకొని నగరంలో విక్రయానికి పెట్టినట్లు గుర్తించిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.
పోలీసుల ఫోకస్
హాస్టళ్లలో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువ కావడంతో ఆశ్రయం కల్పిస్తున్న ఇళ్ల యజమానులకు, ప్రైవేట్ వసతి గృహాల నిర్వాహకులకు పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఆశ్రయం కల్పించే ముందు వారి క్రిమినల్ హిస్టరీ తెలుసుకోవాలని, ఒకవేళ అనుమానం వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
……………………………………………………..