
* ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరున్యూస్, ములుగు: జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై జిల్లాలో ప్రతి వారం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో మాదకద్రవ్యాల నిషేధం ( నార్కోటిక్ డ్రగ్స్ )పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేశారా.. లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాంటీ డ్రగ్ కమిటీల ద్వారా మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఉన్నత పాఠశాలలోనూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. టాస్స్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ పై క్షేత్రస్థాయిలో నిఘా పెట్టాలని అన్నారు. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా ఆబ్కారీ శాఖ అధికారులు కూడా మాదక ద్రవ్యాల నిషేధంపై కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఇంటర్ ఎడ్యుకేషన్ అధికారి నేతత్వంలోనూ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జిల్లా వైద్యశాఖ అధికారులు సైతం ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల నెలవారి సమావేశాలలో డ్రగ్స్ నిషేధం గురించి తెలిపి క్షేత్రస్థాయిలో వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా విస్తృతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇక ముందు జరిగే యాంటి నార్కోటిక్ సమావేశాలకు ఆయా శాఖల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిషేధంపై నిర్వహించిన కార్యక్రమాల నివేదికను తయారుచేసి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. మాదకద్రవ్యాలను జిల్లాలో పూర్తిగా నిషేధించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.
………………………………………….