
– జన్మదిన వేడుకల్లో సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: అభిమానులు మాస్ ఆఫ్ గాడ్ అని, బాలయ్య బాబు అని ముద్దుగా పిలుచుకునే నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినోత్సవాన్ని హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు, చిన్నారులు, వైద్యుల మధ్య భారీ కేక్ కట్ చేశారు. కేన్సర్ బాధిత చిన్నారులకు తినిపించారు. వారికి బహుమతులు కూడా అందజేశారు. ఈసందర్భంగా బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానేంటో రాబోయే రోజులలో చూస్తారని అన్నారు. ఏ అడుగు వేసినా ఆ పనిని ప్రేమించి పని చేస్తానని, తనకు అంకెలతో పని లేదని, తనని తాను ముందుగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తానన్నారు. తాను మెడిసిన్ చదవాలని, తన తండ్రి ఎన్టీఆర్ ఆశించినా కాలేదని, కాకతాళీయంగా 15 సంవత్సరాల క్రితం బసవతారకం ఆస్పత్రి బాధ్యతలు చేపట్టడం ద్వారా తన తల్లి ఆశయాన్ని నెరవేర్చగలగడం పూర్వజన్మసుకృతం అని అన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రత్యేక సర్టిఫికెట్లు అందజేశారు. అభిమానులు, రోగులతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు.
…………………………………………..