* ప్రభుత్వ తీరుపై బండి సంజయ్ ఫైర్
* భక్తుల సమస్యలపై పట్టింపు కరువు
ఆకేరు న్యూస్, కరీంనగర్ : ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయంలో ఆర్జిత సేవల రుసుంను ప్రభుత్వం పెంచింది. ఆలయంలో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని.. వారి సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఆర్జిత సేవల రుసుమును మాత్రం పెంచారని మండిపడ్డారు. ఆలయ అభివృద్ధిని విస్మరించి.. ధరలు పెంచడం దారుణమన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ అధికారులతో ఫోన్లో బండి సంజయ్ మాట్లాడి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆలయాల అభివృద్ధి కంటే ధరల పెంపుపైనే ప్రభుత్వం దృష్టిం పెట్టిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆలయాలు కూల్చివేయడం.. భక్తులను ఆలయాలకు వెళ్లకుండా చేసేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
