* అన్ని పార్టీల్లో అగ్రవర్ణాలదే పెత్తనం
* బీఆర్ఎస్లో నాకు అన్యాయం జరిగింది
* కాంగ్రెస్‌లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు
* వరంగల్ బీఆర్ఎస్లో రెడ్ల రాజ్యం నడుస్తోంది
* బీఆర్ఎస్ సీనియర్ నేత, ‘కుడా’ మాజీ చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్
( చిలుముల్ల సుధాకర్ )
ఆకేరు న్యూస్, వరంగల్ : తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా బ్రతికిన వాడిని. హంటర్ రోడ్‌లోని నా విద్యాసంస్థ తెలంగాణ ఉద్యమ వేదికగా ఉపయోగపడింది. తెలంగాణ రాష్ట్ర కల సాకారం కాగానే నాలాంటి వాళ్ళకు మాత్రం ఏమి రాలేదు. అధికారానికి దూరమైన తర్వాత నైనా నా గురించి ఆలోచిస్తారనుకుంటే నిరాశే ఎదురయింది. అగ్రవర్ణాల పెత్తనంలో రాజకీయ పార్టీలు ఉన్నంత కాలం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అవకాశాలు రావని అర్థమయింది. అందుకే బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తానంటున్న తెలంగాణ ఉద్యమకారుడు , కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్‌తో ఆకేరు న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ ..
ప్ర: ఇటీవలి కాలంలో మీరు బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్టు బాగా ప్రచారం జరుగుతోంది. నిజమేనంటారా..?
సుందర్ రాజ్ : అన్యాయం జరిగిందన్న అసంతృప్తి ఉన్నది నిజమే.. పార్టీ మారినా , మారక పోయినా నా కంటూ ఒక ప్రత్యేక లక్ష్యం మాత్రం ఉన్నది. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను.
ప్ర: ఏ పార్టీలోకి వెళితే న్యాయం జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు..? కాంగ్రెస్‌లోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా..?
సుందర్ రాజ్: బీఆర్ఎస్లో అన్యాయం జరిగిందన్నది నిజమే.. కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఆహ్వానం ఉంది.. అయితే అందులో ఇప్పటికే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగే అవకాశం ఉందన్న నమ్మకం లేదు..
ప్ర: మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మిమ్మల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు దగ్గరకు తీసుకెళ్ళినట్టున్నారు కదా..? కేటీఆర్ మీకేమి హామి ఇవ్వలేదా..?
సుందర్ రాజ్ : కేటీఆర్ ఇపుడేమి హామి ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నారు కదా..! మీకు అన్యాయం జరిగింది.. అధికారం వచ్చినప్పుడు తప్పకుండా న్యాయం చేస్తాం.. మీ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలి అంటాడు.. అంతకు మించి ఇపుడు అనేదేమి ఉండదు కదా.. అదే అన్నాడు..
ప్ర: మీరు సంతృప్తి చెందారా..? బీఆర్ఎస్లో క్రియా శీలకంగా ఎప్పటి నుంచి పనిచేస్తారు..?
సుందర్ రాజ్ : నేను ఉద్యమ కాలం నుంచి క్రియా శీలకంగా పనిచేస్తున్నాను.. ఇపుడు సరికొత్తగా క్రియా శీలకంగా పని మొదలు పెట్టాల్సింది ఏముంటుంది.. ఇక సంతృప్తా…? ఇందులో సంతృప్తి చెందడానికి ఏముంది.. అధికారం ఉన్నప్పుడు కాదు.. కనీసం అధికారం పోయిన తర్వాత నైనా నాకు అవకాశం ఇవ్వలేదు.. అదీ బాధగా ఉండదా..?
ప్ర: ఇంతకు మీరు ఏం అడిగారు..? బీఆర్ఎస్ నాయకత్వం ఏమివ్వలేదు..?
సుందర్ రాజ్ : అందరికీ తెలిసిన విషయమే కొత్తదేమి కాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నాకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ముప్పయి ఏండ్లుగా మాస్టార్జీ పేరుతో విద్యా సంస్థలను నడుపుతున్నాను. గ్రాడ్యుయేట్ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. అవసరమైన మేరకు అంతో ఇంతో ఎన్నికల ఖర్చు కూడా పెట్టుకోగల ఆర్థిక స్థోమత ఉంది.. అన్నిటికీ మించి తెలంగాణ ఉద్యమ కాలంలో క్రియా శీలకంగా జేఏసీ లో పనిచేసిన వాడిని. ఇన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి బీఆర్ ఎస్ పార్టీలో చేరిన ఏనుగుల రాకేష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్‌లు నన్ను సముదాయించారు.. వారి మాటకు గౌరవం ఇచ్చి మౌనంగా ఉన్నాను. ఇంకెప్పుడు మా లాంటి వాళ్లకు గుర్తింపు వచ్చేది.. చాలా బాధగా ఉంటుంది కదా..!
ప్ర: మరీ ఇన్నీ అర్హతలు ఉన్నప్పటికీ కూడా మీకు కేసీఆర్, కేటీఆర్‌లు మీరు పోటీ చేయడానికి ఎందుకు అవకాశం ఇవ్వలేదంటారు..? ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయంటారా..?
సుందర్ రాజ్: ఇందులో ప్రత్యేక కారణాలేముంటాయి. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తన బంధువైన రాకేష్ రెడ్డికి ఇప్పించుకున్నారు. అంతే.. వేరే కారణాలేముంటాయి.
ప్ర: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీకు ఆత్మీయుడు అదే విదంగా కేసీఆర్, కేటీఆర్‌లకు అత్యంత ఆత్మీయుడే కదా..? మీకెందుకు ఇప్పించుకోలేక పోయారంటారు..? మీ కోపం వినయ్ భాస్కర్ మీద ఉండాలి కదా..?
సుందర్ రాజ్: ఉండాలి నిజమే.. ఆయన పరిస్థితే అంతంత మాత్రం అయినప్పుడు ఆయన మీద కోపం చేస్తే ప్రయోజనం ఏముంటుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటీ టీఆర్ఎస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్ర కల సాకారమైన తర్వాత కూడా వినయ్ భాస్కర్ మంత్రి కాలేక పోయాడు కదా.. వేరే పార్టీల నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లకు మాత్రం మంత్రి పదవులు వచ్చాయి… వినయ్ భాస్కర్ మీద కోపం చేస్తే ఫలితం ఏముంటుంది. చెప్పండి..
ప్ర: కాంగ్రెస్ పార్టీలో మీకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వస్తే ఆ పార్టీలో చేరే అవకాశం ఉందంటారా..? లేదంటే ఇంకా ఏదైనా ఆలోచన ఉందంటారా..?
సుందర్ రాజ్ : ఎవరు ఏ నమ్మకం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన మాత్రం లేనేలేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే.. జనాభా పరంగా అతి తక్కువ గా ఉన్న అగ్రవర్ణాలు అన్ని రంగాల్లో తిష్ట వేసి ఉన్నారు. ఆ స్థానంలో ఆ వర్గాలు ఉన్నంత కాలం బీసీ. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి న్యాయం జరగదన్న అవగాహన ఏర్పడిరది. అందుకే బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తాను.. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం.
ప్ర: బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య కూడా తన రాజ్యసభ సభ్యత్యానికి కూడా రాజీనామా చేశారు.. ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న రేవంత్ రెడ్డి అగ్రవర్ణాలకు చెందిన చివరి సీఎం అంటున్నారు.. మీరంతా కలిసి ఏదైనా రాజకీయ పార్టీ పెట్ట బోతున్నారా..?
సుందర్ రాజ్: వాళ్ళ విషయం ఏంటో నాకు తెలియదు.. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ ను ఏర్పాటు చేస్తున్నాం. ఆ సంస్థ ద్వారా బీసీ వర్గాలకు సంబందించిన విద్య,వైద్యం లాంటి రంగాలతో పాటు యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి, ఉచిత శిక్షణ ఏర్పాట్లు చేస్తాం. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో సాధికారత సాధించే విదంగా కృషి చేస్తాం.
ప్ర: బీసీలు అంటే అనేక కులాల సముదాయం కదా.. వైరుధ్యాలు ఉంటాయి. ఘర్షణలు ఉంటాయి. ఆధిపత్య పోరాటాలు ఉంటాయి. ఐకమత్యం ఉండదు అన్న ప్రచారం ఉంది. అదే విదంగా ఎస్సీ , ఎస్టీలను కలుపుకోకుండా మీ లక్ష్యం సాధించుకునే అవకాశమే ఉండదు కదా..? వీటన్నిటిని ఎలా అధిగమిస్తారు..?
సుందర్ రాజ్ : నిజమే.. బలహీన వర్గాల్లో ఉన్న ఈ బలహీనతే అగ్రవర్ణాలకు ఆయుధంగా మారుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు ఐకమత్యంగా ఉండకుండా అగ్రవర్ణాలు అనేక కుట్రలు ఇప్పటి వరకు చేసాయి. ఇక ముందు కూడా చేస్తాయి. ఈ అంశాలను బీసీ కులాల ప్రజలకు వివరిస్తాం.. ఇందుకోసం అనేక రకాల గణాంకాలను సేకరిస్తున్నాం. విడి విడిగా ఉంటే ఏ విదంగా నష్ట పోతామో వివరిస్తాం.. ఇందుకోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న నిపుణుల, మేధావుల సలహాలు తీసుకుంటాం.. అందరినీ ఐక్యం చేస్తాం. బీసీ రాజ్యాధికారాన్ని సాధిస్తాం..
ప్ర : బీసీ ఉద్యమాలు, రాజ్యాధికారం అంటున్నారు.. ఇంతకు మీరు బీఆర్ ఎస్ పార్టీలో కొనసాగుతారా..? లేదా పార్టీని వీడే అవకాశం ఉందంటారా..?
సుందర్ రాజ్: చాలా స్పష్టంగా మరోసారి చెబుతున్నాను.. బీఆర్ ఎస్‌ను వీడాలన్న ఆలోచన లేదు.. బీసీ ల హక్కుల కోసం , రాజ్యాధికారం కోసం పోరాటం ఆపేది లేదు.. ఇదే విషయాన్ని మా నాయకుడు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా స్పష్టంగా చెప్పాను..
———————————–